Sankranti Movies: సప్త రుచులతో ఈ సంక్రాంతి సినిమాల విందు
మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ – జనవరి 12
భోగి ముందురోజున జనవరి 12న చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ప్రెస్టీజియస్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ థియేటర్లలోకి రానున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొత్త స్టైల్ అదిరిపోయింది. ఇప్పటికే మీసాల పిల్ల, శశిరేఖ పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్‌గా సంచలనం సృష్టించాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా స్టార్ట్ చేయడానికి ఓ పర్ఫెక్ట్ సాంగ్ చిరంజీవి వెంకటేష్‌లపై చిత్రీకరించారు. అనిల్ రావిపూడి.. ఫ్లాప్ ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు అనిల్ రావిపూడి.
ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సంచలనం సృష్టిస్తోంది. వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. నయనతార, కేథరిన్ ట్రెసా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్, రొమాన్స్, భావోద్వేగాలతో కూడిన పండుగ వినోదంగా తెరకెక్కుతోంది. కుటుంబ బంధాలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్‌తో పాటు మెగాస్టార్ స్టైల్ కు తగ్గట్టు సరైన ఎలివేషన్లు సినిమాలో ఉండనున్నాయని మన శంకర వరప్రసాద్ గారు చిత్రబృందం చెబుతోంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదన్న నమ్మకం వ్యక్తమవుతోంది.
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ – జనవరి 9
జనవరి నెలలో ముందుగా ‘సంక్రాంతి 2026 సీజన్’ ను ఘనంగా ప్రారంభిస్తూ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రెస్టీజియస్ మూవీ ‘ది రాజా సాబ్’ థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ‘‘రాజా సాబ్’’ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ప్రభాస్ కొత్తగా కనిపించే పాత్రలో నటిస్తుండగా, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘‘రాజా సాబ్’’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.తమన్ ఎస్ సంగీతం, కార్తిక్ పలని సినిమాటోగ్రఫీతో ది రాజా సాబ్ సంక్రాంతి సీజన్‌కు మంచి ఆరంభం ఇవ్వనుందని అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాపై డైరెక్టర్ మారుతి తన స్పందన తెలియచేస్తూ – ‘‘నేను ఈ వేదిక మీద నిలబడ్డాను అంటే అది మీరు ఇస్తున్న సపోర్ట్ వల్లే. రాజా సాబ్ వెనక బలంగా నిలబడిరది ఇద్దరు. ఒకరు ప్రభాస్ గారు, మరొకరు విశ్వప్రసాద్ గారు. విశ్వప్రసాద్ గారు, ఆయన పీపుల్ మీడియా టీమ్ అంతా రాజా సాబ్ కోసం ప్రాణం పెట్టారు. ప్రభాస్ గారు ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటిస్తుండగా, ఈ మారుతి ఆయన దగ్గరకు వెళ్లాడు. రాజా సాబ్ కథ విని ప్రభాస్ గారు చాలా నవ్వుకున్నారు. ప్రభాస్ గారితో మేము ఏదో సినిమా చేశాం అనిపించుకోకుండా ఒక పెద్ద స్పాన్ మూవీ చేశాం. ఈ జానర్ లో మంచి పొటెన్షియాలిటీ ఉంది. దాన్ని మేము మరో రేంజ్ కు తీసుకెళ్తున్నాం. రాజా సాబ్ కోసం ఎంతోమంది కష్టపడ్డారు. నేను పెద్ద రేంజ్ దర్శకుడిని అవ్వడానికి రెబల్ యూనివర్సిటీలో ప్రభాస్ గారు అవకాశం కల్పించారు. నేను రాశాను, తీశాను కానీ ప్రభాస్ గారు ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్, సినిమాతో ఏకమైన తీరు, ఆయన మాకు ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేను. సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నా…. విశ్వప్రసాద్ గారు చాలా ధైర్యంగా రాజా సాబ్ ను తీసుకొస్తున్నారు. అన్ని భాషల్లో రాజా సాబ్ సాధించే విజయం మామూలుగా ఉండదు. ఈ సినిమా సీన్స్ రీ రికార్డింగ్ చేసిన తర్వాత చూస్తుంటే ప్రభాస్ గారి పర్ ఫార్మెన్స్ చూసి ఎమోషనల్ అయ్యాను.’’ అన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ .. ‘‘మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో బిగ్గెస్ట్ స్టార్ తో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. ఏ ఒక్కరినీ కూడా రాజా సాబ్ నిరాశపర్చదు. గ్లోబల్ గా హారర్ ఫాంటసీ జానర్ లో రాజా సాబ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది.’’ అన్నారు.
పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ ఎమ్మన్నారంటే… ‘ఇది నానమ్మ, మనవడి కథ. ఈ సినిమాకు ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే పెరిగింది. అయినా ఎంతో ధైర్యంగా విశ్వప్రసాద్ సినిమా నిర్మించారు. మా డీవోపీ కార్తీక్ ఎంతో స్పీడ్ గా క్వాలిటీగా మూవీ చేశారు. సొలమన్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగదీశారు. మారుతిని ఫస్ట్ కలిసినప్పుడు డార్లింగ్ అన్నీ యాక్షన్ మూవీస్ అవుతున్నాయి, మంచి ఎంటర్ టైనింగ్ మూవీ మన ఫ్యాన్స్ కు ఇవ్వాలి అని అన్నాను. హారర్ కామెడీ జానర్ తో ఈ ప్రాజెక్ట్ రెడీ చేశాం. ఈ మూవీ క్లైమాక్స్ కు వచ్చేసరికి మారుతి గారి రైటింగ్ కు నేను ఫ్యాన్ అయ్యాను. ఆయన పెన్ తో రాశారా మెషీన్ గన్ తో రాశారా అనే డౌట్ వచ్చింది.ఇప్పటివరకు హారర్ కామెడీలోనే కాదు ఇలాంటి క్లైమాక్స్ రాలేదు. మనకు 15 ఏళ్ల తర్వాత మారుతి డార్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాడు. సంక్రాంతి ఇక చూస్కోండి!. అన్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి – జనవరి 13
సంక్రాంతి రేసులో వినోదం, రొమాన్స్‌ను జోడిస్తూ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ రవితేజ కూడా ఈ పండగలో పాలు పంచుకోబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్ పాత్రలో కనిపించనున్నారు. ఆశికా రంగనాథ్, డిరపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలు, హాస్యం ప్రధాన ఆకర్షణలు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నరు. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నఈ చిత్రం భోగి రోజున జనవరి 13న థియేటర్లలోకి రానుంది.
నారి నారి నడుమ మురారి – జనవరి 14
ఒక నాటి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ నారి నారి నడుమ మురారి ఇదే టైటిల్ తో సంక్రాంతి పండుగ జరుపుకునే రోజు జనవరి 14న విడుదల అవుతుంది. ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సాక్షి వైద్య, సంయుక్త ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భాను బోగవరపు కథ, విశాల్ చంద్రశేఖర్ సంగీతంతో రూపొందిన ఈ చిత్రం సరదా పాత్రలతో పండుగకు తేలికపాటి వినోదాన్ని అందించనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనగనగా ఒక రాజు – జనవరి 14
సంక్రాంతి 2026 లైనప్‌లో మరో ఆకర్షణగా అనగనగా ఒక రాజు కూడా పండగ రోజునే జనవరి 14న విడుదల కానుంది. మారీ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం చురుకైన హాస్యం, యువతను ఆకట్టుకునే కథనంతో ప్రేక్షకులను అలరించనుంది. సంక్రాంతి సెలవుల్లో యువ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించే చిత్రంగా ఇది నిలవనుందని భావిస్తున్నారు.
తమిళ్ నుంచి విజయ్ చిత్రం ‘జన నాయగన్’ – జనవరి 9
సంక్రాంతి (పొంగళ్) పండక్కి తమిళ్లో కూడా సినిమాలు విడుదల కావడం ఆనవాయితీ. అయితే పాన్ ఇండియా మార్కెట్ పెరగడంతో తెలుగులోనూ ఆయా సినిమాలను డబ్బింగ్ చేస్తున్నారు. రాబోయే సంక్రాంతికి దళపతి విజయ్ హీరోగా రూపొందుతున్న ‘జన నాయగన్’ విడుదల కానుంది. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అని ప్రచారం జరిగినా… ఆ పాయింట్ తీసుకుని కొత్త సన్నివేశాలతో రాజకీయ నేపధ్యం లో సినిమా తీస్తున్నట్టు టాక్. రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావొచ్చని అంచనా.
తమిళ్ నుంచి శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ‘పరాశక్తి’ జనవరి 14
తమిళ సినిమా రంగంలో మరో విశిష్టమైన రాజకీయ కాలానుగుణ చిత్రంగా ‘పరాశక్తి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్ తన 25వ చిత్రం గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు రవి మోహన్, అథర్వా మురళి, శ్రీలీల ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దేవ్ రామ్‌నాథ్ తదితరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సమకూర్చిన సంగీతం, నేపథ్య స్వరం ఈ కథనాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దనుంది. ఈ చిత్రాన్ని ఆకాశ్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. 2026 జనవరి 14న ‘పరాశక్తి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చరిత్ర, రాజకీయాలు, భావోద్వేగాలు మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ మరపురాని అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.






