Legacy: విశ్వక్ సేన్, సాయి కిరణ్ దైదా, కలాహీ మీడియా కలయికలో ఆసక్తికర పొలిటికల్ డ్రామా ‘లెగసీ’
సంచలన టీజర్ తో ‘లెగసీ’ చిత్ర ప్రకటన
ఒకే తరహా సినిమాలు చేయకుండా విభిన్న పాత్రలు, భిన్నమైన కథలతో ముందుకెళ్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఎక్కువ సినిమాలు చేయడం కంటే, నాణ్యమైన సినిమాలు చేయడానికి ప్రాధాన్యతను ఇస్తూ.. ఉత్తమ వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అదే ఆయనకు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి పెట్టింది. “మినిమమ్ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ” హీరో అనే పేరు కూడా తెచ్చి పెట్టింది.
ఇప్పుడు ఆయన, సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన విమర్శకుల ప్రశంసలు పొందిన ‘పిండం’ చిత్రాన్ని నిర్మించిన కలాహీ మీడియా పతాకంపై తెరకెక్కుతోన్న రెండవ సినిమాలో నటిస్తున్నారు. ‘లెగసీ’ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రానికి కూడా ‘పిండం’ సినిమాతో తన ప్రతిభను చాటుకున్న సాయి కిరణ్ దైదా రచన, దర్శకత్వం వహిస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా, 2026 జనవరి 1న ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ, అద్భుతమైన టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
‘లెగసీ’ ఒక రాజకీయ నేపథ్యంతో సాగే కథ. అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథగా ఇది రూపొందుతోంది.
వారసుడు లేని కుర్చీ చుట్టూ తిరిగే అవకాశవాద రాజకీయ రాబందులను తాను ఎంతగా ద్వేషిస్తాడో చెప్పే విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమవుతుంది. రాజకీయ క్రీడలు, ఉన్నత స్థానాన్ని పొందడానికి వేసే ఎత్తుగడలు, అవకాశవాద రాబందుల మోసం తనకు నచ్చకపోయినా.. వారసత్వాన్ని ఎవరో ఒకరి సమర్థ భుజాలపై మోయాల్సిన అవసరం ఉన్నందున, తాను ఆ బాధ్యతను చేపట్టాల్సి వచ్చిందని చెబుతాడు.
తన దివంగత తండ్రి స్మారక చిహ్నాన్ని సందర్శించడానికి వెళ్తున్నట్లు విశ్వక్ సేన్ పాత్రను పరిచయం చేశారు. అక్కడ అతను మృతదేహంపై మూత్ర విసర్జన చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం వైవిధ్యంగా ఉంది. ఆ తర్వాత రాజకీయ నాయకుల మధ్య అతను తుపాకీ పట్టుకొని కనిపించడం, తన గదిలో కాల్పులు జరగడం వంటి దృశ్యాలు ఉత్కంఠను పెంచాయి.
క్రూరంగా, రూఢిగా, దుఃఖంతో నలిగిపోయిన, మనసు విరిగిపోయిన, మొరటు వ్యక్తిగా విశ్వక్ సేన్ అద్భుతంగా మెప్పించారు. ఆయన లుక్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పొలిటికల్ డ్రామాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. నటనా నైపుణ్యం, కళ్లలో కనిపించే తీవ్రత, నడక, బాడీ లాంగ్వేజ్‌తో పాత్రలో పూర్తిగా లీనమైపోయిన తీరు ఈ చిత్రంపై అంచనాలను, ఉత్సుకతను పెంచుతోంది.
పిండం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తర్వాత, దర్శకుడు సాయి కిరణ్ దైదా ఒక ఉత్కంఠభరితమైన పొలిటికల్ డ్రామాకి ప్రాణం పోసేందుకు సిద్ధమయ్యారు. టీజర్ లోని విజువల్స్ ఆయన సాంకేతిక మరియు కళాత్మక నైపుణ్యాన్ని స్పష్టం చేశాయి. నిర్మాతలు యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం, పాత్ర యొక్క చీకటి మరియు తీవ్రమైన స్వరానికి తగ్గట్టుగా అద్భుతంగా ఉండి, టీజర్ ను మరోస్థాయికి తీసుకొని వెళ్ళింది. ’96’కి స్వరకర్త కావడంతో, ఈ చిత్ర సంగీతంపై అంచనాలు భారీగా ఉన్నాయి. జిజు సన్నీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలు శిరీష్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తుండగా, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, కే కే మీనన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అనౌన్స్మెంట్ టీజర్‌తోనే ‘లెగసీ’ సినిమా ప్రేక్షకులలో అసాధారణ మార్కులను సాధించింది. ఇంత అద్భుతమైన ప్రారంభంతో తెలుగు సినిమాకు ఇది నిజంగా చాలా సంతోషకరమైన నూతన సంవత్సరం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది.






