రమణ వ్యాసాలు 1: విశ్వజనీన సావిత్రి మహోదయ ప్రస్థానం- డాక్టర్ రమణ వి. వాసిలి
ముక్కోటి దేవతలు ఆ పైన మరికొన్ని వందల దేవుళ్లు ఉంటారంటే కొందరు ఏకీభవించక పోవచ్చు కానీ ఈ సృష్టి సమస్తాన్ని ఏదో ఒక మహా శక్తి నడిపిస్తుంది అని అంటే అందరూ అంగీకరించే అవకాశం ఉంది. ఈ చరాచర సృష్టి ఈశ్వరేచ్చ అయితే జగన్మాత స్వరూపమే ప్రకృతి. సావిత్రి సత్యవంతుల కథ అందరికీ తెలిసిందే. తెలియనివారికి నాలుగు వాక్యాల్లో చెప్పవచ్చు. అలాంటి కథని ఆంగ్లంలో వేయి పేజీల మహా కావ్యంగా మలచిన పూర్ణయోగి అరవిందుడు. ఆ అరవిందుని సావిత్రిని తెలుగులో ఆంధ్రులకి అందించిన భృక్త రహిత తారక రాజ యోగ పుంగవులు శ్రీ శార్వరి.
మహాభారతంలో సావిత్రి సత్యవంతులు
సావిత్రి సత్యవంతుల కథ మహాభారతం లోనిది. సావిత్రి అశ్వపతి కుమార్తె. రాజ్యభ్రష్టుడై అరణ్యవాసం చేస్తున్న ద్యుమత్సేనుని కుమారుడు సత్యవంతుడు. అల్పాయుష్కుడని, ఒక్క సంవత్సరం మాత్రమే జీవిస్తాడని నారదముని హెచ్చరించినా సత్యవంతుడిని వివాహం చేసుకొని అరణ్యంలోనే కాపురం చేస్తుంది సావిత్రి. మృత్యువు ఆసన్నమయ్యే రోజు అది, సత్యవంతుడికి అంతిమ ఘడియలని తెలిసిన సావిత్రి చేసిన మహోదయ మహాప్రస్థానం, ఇది అరవిందులు యౌగికప్రస్థానం.
భారతీయ సాహిత్యంలో అరవింద యోగి రచించిన ‘సావిత్రి’లాంటి సంక్లిష్టమైన కావ్యం మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. సావిత్రి రచన ఒక మహా సాహిత్యయజ్ఞం. సావిత్రిని తొలుతగా ఆంగ్లంలో రాసిన శ్రీ అరవిందులు, తెలుగులో రాసిన శ్రీ శార్వరి యోగనిష్ణాతులు. శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీ సంజీవదేవ్, డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి, డాక్టర్ అరిపిరాల విశ్వం, డాక్టర్ ఎం. శివరామకృష్ణ, డాక్టర్ వి. వి. ఎల్. నరసింహారావు, మరెందరో సాహితీ దిగ్గజాలు చెప్పినట్లు సావిత్రిని అర్థం చేసుకోవడం, రాయడం సామాన్యమైన విషయం కాదు. అది ఒక తపస్సు, యోగసాధకులు మాత్రమే సావిత్రి ఆత్మని అందుకోగలరు.
భృక్తరహిత తారక రాజ యోగం – పూర్ణ యోగం
సావిత్రిని యోగజిజ్ఞాస కలవారి కోసం, యోగార్హత కలవారి కోసమే రాశాను అంటారు శ్రీ శార్వరి. ఇలా చెప్పడంతో కవి తన కావ్యాన్ని కొందరికే పరిమితం చేస్తున్నట్లు అనిపించినా వాస్తవానికి రచన ప్రాశస్త్యాన్ని, ఉద్దేశ్యాన్ని వక్కానిస్తున్నారు. యోగాభ్యాసనతో జీవిస్తున్నవారిని నేను రాసిన సావిత్రి ఏ ఆధ్యాత్మిక యోగభూమికలకు చేర్చాలో చేర్చి తీరుతుంది. సావిత్రి అర్ధం కావాలంటే యోగజిజ్ఞాసతో పాటు సత్యాన్వేషణ, సద్బుద్ధి కూడా అవసరం. పరాన్ని అన్వేషించాలన్న తపన కావాలి. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గి, ఆధ్యాత్మిక విషయాల పట్ల అనురక్తి ఏర్పడాలి. ఏ యోగమార్గంలో యోగసాధన చేస్తున్న వారికైనా సావిత్రి కొత్తవాకిళ్ళు తెరుస్తుంది.
ఏ యోగి కేవలం తన ముక్తి కోసం తపస్సు చేయడు. తన కోసం కాదు, మానవ జాతికోసం, మానవ భవిష్యత్తు కోసం, మానవ విముక్తి కోసం ఆరాటపడతాడు. సత్యవంతుడు పునర్జీవుడు కావడం అంటే లోకంలో సత్యం నిలుస్తుందని. మానవ విజయానికి, అరవిందుని పూర్ణయోగ లక్ష్యసాధనకు అది సంకేతం.
అరవిందుల యోగదర్శనం
సావిత్రి మానవతకు ప్రతీక, ప్రతినిధి. అసంభవాన్ని సంభవిం చేయగలిగింది. అరవిందుని సావిత్రిలో కనిపించేది కవిత్వం కాదు, అది అరవిందుల యోగదర్శనం. భౌతికానికి అది కవితాధారే అయినా నిజానికి అది ఒక మహా చైతన్యధార. సావిత్రి కావ్యంలో ఆత్మ ఎలా ఏకత్వం చెందిందో చెప్పబడింది. ఏకత్వమనే పూర్ణత్వాన్ని స్వప్రయత్నంతో, స్వయం కృషితో, యోగసాధన ద్వారా సాధించాలి. అందుకు అధిమానసిక వికాసం, అధిమానవతా విలీనం, దివ్యప్రేరణ, దివ్యజీవనం ఆలంబనం కావాలి. అప్పుడే మనిషి మనీషి అయి విశ్వంభరులం కాగలం అంటారు శ్రీ శార్వరి తను రచించిన సావిత్రి మొదటి పుస్తకం ‘మహోదయం’లో. అరవిందుల పన్నెండు భాగాల ఆంగ్ల సావిత్రిని మహోదయం, అన్వేషణ, స్పందన, యోగవిభూతి, నిర్వాణం, పరనిర్వాణం, మహా పరనిర్వాణం, దివ్యజ్ఞానం మరియు దివ్యజీవనం అంటూ తొమ్మిది పుస్తకాలుగా తెలుగులో రాశారు శ్రీ శార్వరి. మొదటి మూడు పుస్తకాలయిన మహోదయం, అన్వేషణ మరియు స్పందనలను కలిపి ఒకే భాగంగా ‘యోగదర్శనం’గా పునర్ముద్రించడం జరిగింది.
మృత్యువు వాకిట్లో సత్యవంతుడు
ఏరికోరి మనువాడిన భర్త చివరి క్షణాలు. చుట్టూ చిమ్మ చీకటి, సావిత్రి హృదయాంతరాలల్లో గాఢాంధకారం. మరికొద్ది గడియల్లో ఉషోదయం కానుంది. సత్యవంతుడి ప్రాణాలు ఎలాగయినా నిలపాలన్న కృతనిశ్చయంతో ఉన్న సావిత్రికి అది తెలియని ఒక మహోదయం.
నరకంలో అడుగు పెట్టకుండా ఎవరూ స్వర్గాన్ని చేరలేరు అంటారు శ్రీ అరవిందులు. ఎన్నెన్నో కష్టాలు, ఒడిదుడుకులు, మరెన్నో పరీక్షలు తర్వాత గాని భగవంతుడి కరుణాకటాక్షాలు మనకి లభించవు. మనస్సు అజ్ఞానం నుండి, అంధకారం నుండి క్రమంగా బయటపడి వెలుగులు నింపుకొని పరిణామక్రమంలో చివరకు దివ్యం కావాలి. ప్రతి జీవి పరమాత్మ కావాలి. అణువు బ్రహ్మాండం కావాలి. “నశించి పోయినదంతా పునర్మితం కావాలిసిందే” అంటారు శ్రీ శార్వరి. ఆధ్యాత్మికత అన్నింటిని పవిత్రం చేయగలదన్నది సనాతన ధర్మానుష్టానుపరులందరి నమ్మకం. శ్రీ శార్వరి మహోదయం 1981లో తొలిసారిగా ప్రచురణ జరిగినప్పటి నుండి గత నాలుగున్నర దశాబ్దాలుగా సావిత్రి అంటే శార్వరిగా, శార్వరి అంటే సావిత్రిగా తెలుగు నాట, తెలుగుగోడి నోట విశిష్టంగా కొనియాడబడింది.
శ్రీ శార్వరి దృష్టిలో సావిత్రి అంటే, నిశ్శబ్దానికి నిర్వచనం, నిశ్చల జ్వలితాగ్ని సాగరాలకు ప్రతినిధి, దేవతల శక్తి, సంయమనం అన్నీ తానే. ఆమె అనురాగమే ఒక పవిత్ర దేవాలయ ప్రాంగణం. ఆమె అంతరంగ సంకల్పమే స్వర్గలోక ప్రవేశం. ఆమెలోని అనురాగం ఈ విశ్వం కన్నా విశాలమైంది. ఆమె హృదయంలో ఈ విశ్వం యావత్తు విశ్రమించవచ్చు. అసంతుష్ట దేవతలందరూ అక్కడ కొలువుండవచ్చు. ఆమెలో పరమాత్మ తన ఔన్నత్యాన్ని గుర్తించాడు. పరమాత్మ ఆమెలో తన అనంతత్వాన్నే చూసుకున్నాడు.
ఇది సాధారణ మేధకి, ప్రజ్ఞకి అందని అలౌకికం. పరిశుద్ధ ఆత్మ మాత్రమే గుర్తించగలిగే పరమౌన్నత్యం. ఆత్మపథంలో పయనించదలచిన వారికయినా కష్టాలు నష్టాలు తప్పవు, భరించడం తప్పనిసరి అవుతుంది. జన్మించిన ప్రతి జీవి విధికి తలవొగ్గక తప్పదు. విషాదం, పతనం, మృత్యువు బాధిస్తాయి. కాలప్రవాహంలో యుగాలు గడిచినా, తరాలు మారినా పశుబలం ఏదీ పరలోకాల హద్దుల్ని చేరలేదు. ఇహలోక సంపదలతో స్వర్గాన్ని చేరడం దుస్తరం. “యోగి తాను ఒక్కడే అయినా అఖండ జ్యోతిని వెలిగించగలడు”. ఆణిముత్యాల్లాంటి ఇలాంటి వాక్యాలు ఈ పుస్తకంనిండా కోకొల్లలు. చదివేకొద్ది హృదయాన్ని రంజింపజేస్తుంటాయి.
ఒక సత్సంకల్పం, ఒక మహత్తర కార్యం, ఒక ప్రార్ధన మనిషి శక్తిని దైవశక్తితో జతపరుస్తుంది. అప్పుడు అద్భుతాలు సర్వసామాన్యమై ప్రకృతి మార్గాన్నే మార్చుతుంది. ఒంటరి సంకల్పమే విశ్వశక్తిగా వ్యాపిస్తుంది. అంధకారశక్తులు బ్రహ్మానందాన్ని గర్హిస్తుంటాయి. శృతిమించి అనుభవించిన సుఖాలకు కడకు కఠిన శిక్షలు తప్పవు. మనిషి అత్యాశలకు, వాంఛలకు తగిన శిక్షలు పరమాత్మ న్యాయస్థానం విధించి తీరుతుంది.
యోగసాధనతో దివ్యజ్యోతి సందర్శనం
యోగసాధనతో ఆత్మ అంతరవలోకనలో దివ్యజ్యోతిని దర్శిస్తుంది. ఈ మానవ యంత్రం వెనుక ఈశ్వర తత్వం వుంది. యోగాగ్ని జ్వలించినప్పుడే సత్యం తెలుస్తుంది. అప్పుడే మానవునిలోని పరమాత్మ విజయం సాధించినట్లు. అంతవరకు కనిపించని ఈశ్వర రూపం సాక్షాత్కరిస్తుంది. ఐచ్ఛికంగా, ఆత్మ సమర్పణ చేసినప్పుడు చీకటి నుండి వెలుగులోకి జీవున్ని జగన్మాతే నడిపిస్తుంది. జన్మల మధ్యకాలంలో జీవాత్మ పరమాత్మ వైపు సాగుతుంది. సృష్టిలో అన్నీ మరణించినా ఈశ్వరీయత జీవించేవుంటుంది. విశ్వవ్యాప్తమైన అజ్ఞానం అర్థంకానిది. అలాగే జగన్మాత సృష్టి నిర్వహణ చాతుర్యం మరీ విచిత్రం. నశ్వరమైన పదార్థాలతో నిర్మించిబడినది జీవి. ఈ ప్రపంచానికి ఆవలిది, అతీతమైనది అమరత్వం.
సావిత్రి సత్యవంతుల కథగా చెప్పబడిందే కాని సావిత్రి రచన వాస్తవానికి శార్వరి అరవిందుల యోగానుభవాలను అక్షరరూపంలో నిక్షిప్తం చేసిన మహాకావ్యం.
అసలు సావిత్రి ఎవరు?
సావిత్రి “విశ్వకామన” వల్ల జన్మించింది. విశ్వకామనకు రూపం ఇచ్చినవాడు అశ్వపతి. అశ్వపతి కేవలం మద్ర ప్రభువే కాదు, ఒక జాతికి ప్రతినిధి. అంతేకాదు సృష్టిలో ఉత్తమ సృష్టి అయిన మానవునికి ప్రతినిధి. అంటే పరోక్షంగా మానవజాతి సమస్తం “జగన్మాత” ఆవిష్కరణను వాంఛించింది. ఆ వాంఛ అశ్వపతి ద్వారా అభివ్యక్తమైంది. ఆయన జీవాత్మ, ఆయన యోగం, తపస్సు అన్నీ పరమాత్మ కోసమే. పరబ్రహ్మ సాక్షాత్కారం కోసమే. బ్రహ్మజ్ఞానం కోసమే. తపస్సు చేసే ప్రతివ్యక్తి, ప్రతి యోగి ఒక అశ్వపతి. తన పూర్ణయోగ లక్ష్యాన్నే అరవిందులు అశ్వపతిలో ప్రతిష్ఠించారు. ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది సంపూర్ణం కాదు. పైకి కనిపించే ఈ రూపం వెనుక అనేక పొరలున్నాయి, అనేక రూపాలున్నాయి. పరప్రజ్ఞకు ప్రభావితుడైన జీవి “సత్య”శుద్ధుడు. అటువంటి జీవాత్మ భౌతిక సుఖాలను, ఆనందాలను లెక్కచేయదు.
జీవుడు ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించినప్పుడు అతీంద్రియ, ఆధ్యాత్మిక శక్తుల్ని, సుధల్ని గ్రోలి, అగోచర పవిత్రతని చేరడానికై తేజోకిరణాలపై పయనిస్తాడు. అతని ఆత్మ పరమాత్మ ప్రతినిధిగా భాసిస్తుంది. అతని మనస్సు స్వర్గారోహణ చేసే జ్వలితజ్వాల. అతని సంకల్పం కాంతిసీమలలో తిరుగాడే కాంతి. ప్రతి శ్వాసలో సాగరమంత ఆకాంక్ష కనిపిస్తుంది. ప్రతి చర్యలో భగవంతుని ముద్రలు కనిపిస్తాయి. అనుక్షణంలోను ఏదో అదృశ్యశక్తి రెక్కల చప్పుడు.
మనిషి జీవితమే ఒక సుదీర్ఘ ప్రయోగం
ఆశనిరాశలకు, శాంతిసంగ్రామాలకు అది ఆలవాలం. ప్రతి శిఖరారోహణ అనితరసాధ్యం అనిపిస్తుంది. అంతర్జ్యోతితో చీకట్లను చీల్చుకుంటూ ముందుకు సాగుతాడు. ధ్యానంతో జీవుడు అనంతసీమలలో విహరిస్తాడు. పరిమిత జ్ఞానం అపరిమిత విజ్ఞానంగా మారి, జీవి ప్రజ్ఞ పరబ్రహ్మ ప్రజ్ఞగా పరిణమిస్తుంది. యోగి తన ఆత్మ వైశాల్యంలోకి ఎదిగిన కొద్దీ అతని చాలనంలో మానవత క్రమంగా తగ్గిపోతుంది. జీవుడు ఉన్నతుడై ఉత్తమలోకాలను దర్శిస్తాడు. దివ్య దృష్టితో పరమాత్మను దర్శించగలడు. పరలోక జీవులు మనకు చేరువై సంభాషిస్తారు. మనం చనిపోయారనుకున్నవారు చిరంజీవులు. జనన మరణాలకు అతీతులై, అతీంద్రియులై, అవ్యక్తమైన ప్రజ్ఞానాన్ని మనకు అందిస్తారు. మహా పాపులైన వారు, మహా మహా పుణ్యాత్ములు పరమేశ్వరుని ధర్మాసనం వద్ద సహచరులే. తమ తమ వైరాలను, వైషమ్యాలను విస్మరించి ఎవరికి వారు తామే పరమాత్మ ప్రతినిధుల మనుకుంటారు. యోగి వర్తనంలో గతాన్ని, భవిష్యత్తుని దర్శిస్తాడు. క్షణాలలో లెక్కలేనన్ని సంవత్సరాల అనుభవం పొందుతాడు. కానీ నడక నేర్చిన పసివాడు ఎక్కువ దూరం నడవలేనట్లు పరాన్ని అన్వేషించే మహా సంకల్పాన్ని జీవుడు మద్యలోనే విరమిస్తాడు.
సృష్టిలో శాశ్వతమైనది ఈశ్వరీయతే!
ఈ సృష్టిలోని ప్రతి కదలిక పరమాత్మ స్పందనే. ఈ రూపాలలో, శక్తులలో ఆత్మ దాగి ఉంది. కదిలే ప్రతి దృశ్యంలోను ఆత్మదర్శనం అవుతుంది. ప్రతి వస్తువులోను, అగోచరమైన పరమాత్మ తేజస్సు భాసిస్తూ వుంటుంది. ప్రతి వస్తువులోను “అరూప” పరమాత్మ కదులుతూ అన్ని ఆత్మలలో, వస్తువుల్లో తన పూర్ణరూపాన్ని వెతుకుతుంది. పరాన్వేషణలో జీవితం నిరర్థకం, నిర్హేతుకం కాదు.
యుగకర్త సావిత్రి
ఒక్క ఆత్మ సంకల్పం మానవజాతిని ఉద్ధరిస్తుంది, దిశానిర్దేశం చేస్తుంది. మృత్యువు సమీపిస్తున్న సత్యవంతుడి విషయంలో సావిత్రిది అటువంటి సంకల్పమే. సృష్టికి ఎదురు నిలిచే అంతటి మహాశక్తి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఆత్మ చైతన్యంతో జీవిలోని విశ్వశక్తులన్నీ ఏకం అవుతాయి. అనంత దివ్యత్వం ప్రాపంచిక అల్పత్వాన్ని త్రోసివేస్తుంది. జీవి ఒక యుగాన్ని మార్చివేయగల శక్తిని సంపాదిస్తాడు. అందుకు ప్రతీక సావిత్రి!
సామాన్యులకు యోగబలం అర్థం కాదు. యోగి జరగనున్న పరిణామాలను ముందుగానే గ్రహిస్తాడు, భవిష్యత్తుకి అనుగుణంగా తన పని కొనసాగిస్తాడు. మనిషి వేగాన్ని మించి కాలంలో పయనిస్తాడు. అతను ఏకాంత జీవి అయినా రవికిరణ తేజం అతనిది. అందుకు ప్రతీక సావిత్రి!
యోగంలో ప్రయోగం చేయదలచిన వారికి విషయం తెలుసివుండాలి. ప్రాచీన గ్రంథాల పరిచయం అవసరం. అవి అందించే గుప్తవిద్య, గుప్తజ్ఞానం యోగికి మార్గదర్శకంగా ఉంటాయి. మనిషికి దివ్య సహాయం ఎప్పుడూ ఉంటుంది. అంటే దేవతలు దిగిరానవసరం లేదు. వారి నుండి దిగి వచ్చిన శక్తి చాలు మనల్ని నడిపించడానికి. అదే దివ్యశక్తి. మహాత్ములు మాత్రమే మృత్యుంజయులు కాగలరు. కాలావధుల్ని దాటి పరంలో జీవించగలరు. వారు భావదాస్యాలు, భవబంధాలు లేని స్థితప్రజ్ఞులు. ఇఛ్ఛా సంకల్పాలను, విధి కర్మలను దాటగలరు. విశ్వవిన్నాణాలను, చమత్కృతులను తెలుసుకోగలరు. ఈశ్వర సంకల్పాన్ని గ్రహించి, కాలాన్ని మళ్ళించగలరు. దివ్యమాయలో జరిగే సుఖదుఃఖపు నాటకంలో ఆనందం కోసం జీవి చేసే అన్వేషణ ఎన్నటికీ అంతంకాదు.
కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుని ఉవాచని స్ఫురణకు తెస్తాయి సావిత్రిలోని ఈ క్రింది వాక్యాలు.
పరమాత్మ మరల మరల జన్మిస్తూనే వున్నాడు.
తానే సృష్టికర్త, నిర్మించిన లోకమూ తానే.
చూచె దృశ్యమూ తానే, చూస్తున్నవాడు తానే.
నడిపిస్తున్నదీ తానే, నడుస్తున్నది తానే.
తెలుసుకోదగినది, తెలుసుకునేవాడు రెండు తానే.
తానొక్కడే రెండై, అన్ని లోకాలలో సంచరిస్తుంటాడు.
జ్ఞానం, అజ్ఞానం ఒక్కరిలోనివే.
చీకటి, వెలుగులు ఒక్కటే, ఒకదాని వెంట మరొకటి.
ఈ ప్రపంచానికి ఆవలిది, అతీతమైనది అమరత్వం
పైకి కనిపించే దానినే యదార్థమనుకుంటాం. కనిపించే కొంతమేరకే సమస్తంగా, సర్వస్వంగా తలుస్తాం. ఈ లోకంలో పరమాత్మ ఆత్మగాను, శక్తి ప్రకృతిగాను చరిస్తారు. జగన్మాత పథకం ఏదో మన దృష్టికి అందదు. ఆత్మచైతన్యంతో మనం ఉచ్ఛరించే వాక్యాలు ఆదిదంపతుల భావనలే.
ఈ సృష్టిలో ప్రతి అణువులో ఈశ్వరాంశం వుంది. సృష్టికి ఈశ్వరత్వం ఒక్కటే ఆధారం. అన్నీ మరణించినా ఈశ్వరీయత జీవిస్తుంది. చీకటి నుండి వెలుగులోకి జీవుని జగన్మాతే నడిపిస్తుంది. ఈ ప్రపంచానికి ఆవలిది, అతీతమైనది అమరత్వం.
నిర్వికార, నిరాకార, నిర్గుణ, నిరంజనుడైన పరమేష్ఠి ఒకే ఆత్మ కేంద్రంగా అనేకానేక జీవుల్ని సృష్టించాడు. అందరిలో తానే వుంటూ, విశ్వాన్నే తనదిగా చేసుకున్నాడు. ఈ విశాల విశ్వమూ తానే, కాలమూ తానే అయినాడు.
నిర్వాకార, నిరాకార, నిర్గుణ, పరబ్రహ్మమూర్తి మనలోనే వుంటూ, మన ఆత్మగా నిగూఢంగా వుంటూ మన అసమగ్రతను సైతం తనదిగా మార్చి, ఈ రక్తమాంస శరీరాన్ని తనదిగా చేసుకున్నాడు. జీవుడు మానవ రూపంలో పరిధిలో ఇమిడిన పరబ్రహ్మ స్వరూపం.
ఒకే పరమాత్మ, అనేకాత్మలుగా మారిన పరబ్రహ్మం, వెనుక మిగిల్చేది, మిగిలేది ఏకైక అనంతత్వం. అనంతకాలంలో అనంతంగా జన్మిస్తున్న పరమాత్మ అనంత దిగంతాలలో పరిమితాలైన సృష్టి సర్వస్వం తానే. ప్రకృతిలోని ప్రతి పదంలో పరమాత్మ గుప్తంగా వుంది. సృష్టికి మూలమైన ఆ పరమేశ్వరుడు మనలోనే దాగి తన శక్తితో నడిపిస్తుంటాడు. పరమాత్మకు మానవశరీరమే (జీవాత్మ) స్వగృహం. జగత్తు యావత్తూ ఆయన నివాసమూ, విలాసమందిరమూ. ఆయన మహత్యాలకు ఈ లోకం ఒక కర్మశాల.
ఆత్మ చైతన్యానికి తొలిమెట్టు మహోదయం
యోగశక్తులతో భౌతికంగా సుఖపడవచ్చు కానీ, ఆత్మకు సుఖం ఉండదు అంటారు శ్రీ శార్వరి. యోగానుభవాలు తానొక్కడే ఉపయోగించేవి కావని, మొత్తం మానవజాతికి యోగ్యమైనవి, అవసరమైనవి అని గట్టిగా నమ్మే యోగపుంగవులు ఆయన. ఆధ్యాత్మికంగా నాలుగుమాటలు చెప్పగలిగిన ప్రతిఒక్కరూ పేరుకు ముందు, పేరుకు వెనక బ్రహ్మర్షి అనో, బ్రహ్మజ్ఞాని అనో తమకు తామే స్వయంగా బిరుదులు తగిలించుకుంటున్న ఈరోజుల్లో, దాదాపు ఐదు దశాబ్దాల పాటు కొన్ని వందల మందికి యోగ నిర్దేశకులై, దిశా నిర్దేశకులై, కొన్ని వందల ఆధ్యాత్మిక గ్రంథాలు రచించిన శార్వరి కేవలం శ్రీ శార్వరిగా లేదా మాస్టర్ శార్వరిగా అందరిచేత పిలవబడ్డారు, కీర్తింపబడ్డారు. ఇది శార్వరీయ సావిత్రి తొలి పుస్తకం, ‘మహోదయం’. మనోవికాసానికి, ఆత్మచైతన్యానికి నాంది, ఇదే తొలి మెట్టు. సావిత్రితో విశ్వచైతన్య దిశగా మీరు ముందుకు సాగండి.
Dr. Ramana V. Vasili
Spiritual Foundation
7062 Beringer Drive South
Cordova, Tennessee 38018 (USA)
901-387-9646
ramanavvasili@hotmail.com






