Chandrababu: కొత్త సంవత్సరంలో ఏపీ రాజకీయాలకు కొత్త మలుపులు ..కూటమి ప్రభుత్వంపై అంచనాలు, చర్చలు..
క్యాలెండర్ మారిన ప్రతిసారి కొత్త ఏడాది మీద ఆశలు, అంచనాలు సహజంగానే పెరుగుతాయి. 2025 ముగిసి 2026 ప్రారంభమవడంతో ఈ ఏడాదిలో ఏమి జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. వ్యక్తిగత జీవితాలతో పాటు రాజకీయాలు, పరిపాలన, ఇతర రంగాలపై కూడా చర్చలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రజలతో నేరుగా ముడిపడి ఉన్న పాలన రంగం గురించి సామాన్యులు కూడా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విషయానికి వస్తే, 2025 ఏడాది కూటమి ప్రభుత్వానికి ఒక విజయవంతమైన పాలనా సంవత్సరంగా గడిచిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు మిత్రపక్షాల మధ్య ఎలాంటి విభేదాలు బయటకు రాకుండా, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారని అంటున్నారు. కూటమిలో ఐక్యత కొనసాగడం వల్ల పరిపాలన సజావుగా నడిచిందన్న భావన కూడా బలంగా ఉంది.
అయితే 2025లో కూటమి ప్రభుత్వంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా మెగా బ్రదర్ (Mega Brother) నాగబాబు ( Nagababu)కు కేబినెట్లో అవకాశం వస్తుందన్న ప్రచారం జరిగింది. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై తొమ్మిది నెలలు గడిచినా మంత్రి పదవి దక్కకపోవడంతో, దీని వెనుక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2026లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్న మాట కూడా అప్పుడే మొదలైంది. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించడంతో, 2026 జూన్ నాటికి రెండేళ్ల పాలన పూర్తవుతుంది.
సాధారణంగా ప్రభుత్వాలు రెండేళ్ల తర్వాత తమ పనితీరును సమీక్షించి మంత్రివర్గంలో మార్పులు చేస్తుంటాయి. చివరి ఏడాది పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతుందని, ఆ సమయంలో చేసిన మార్పులు ఆశించిన ఫలితాలు ఇవ్వవన్న అభిప్రాయం రాజకీయాల్లో ఉంది. అందుకే రెండేళ్ల సమయం కీలకమని భావిస్తారు. అదే లాజిక్ ప్రకారం, కూటమి ప్రభుత్వం కూడా రెండేళ్ల పాలనను బేరీజు వేసుకుని 2026లో పెద్ద ఎత్తున మార్పులు చేయవచ్చని చర్చ సాగుతోంది.
ప్రస్తుతం కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మంత్రివర్గంలో ఒక ఖాళీ ఉంది. మార్పులు చేర్పులు చేస్తే మరో ఆరు లేదా ఏడు స్థానాలు అందుబాటులోకి రావచ్చని అంచనా. దీంతో కేబినెట్ బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ ఉండడం ఖాయం. ప్రాంతీయ సమతుల్యత, రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు.
అయితే ఎప్పుడు మార్పులు జరిగినా ఉత్తరాంధ్ర (North Andhra), గోదావరి జిల్లాలు (Godavari Districts), రాయలసీమ (Rayalaseema) నుంచి ఒక్కొక్కరికి పదవి గండం తప్పదన్న రాజకీయ జోస్యాలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు పనితీరు ఆశించిన స్థాయిలో లేని మరికొందరికి కూడా పదవులు కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో విస్తరణ జరిగితే విశాఖ జిల్లా (Visakhapatnam District), కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా (Polavaram District) నుంచి ఒకరికి అవకాశం రావచ్చన్న అంచనాలు ఉన్నాయి. గోదావరి ప్రాంతంలో ఒక సీనియర్ బీసీ నేతకు, రాయలసీమలో ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి 2026 ఏడాది ఎవరి ఆశలను నెరవేర్చుతుందో, ఎవరి రాజకీయ భవిష్యత్తుకు మలుపు తిప్పుతుందో వేచి చూడాల్సిందే.






