Bojjala Sudheer Reddy: జనసేన కార్యకర్త హత్య.. ఎమ్మెల్యే విచారణకు రంగం సిద్ధం?
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజకీయాల్లో కలకలం రేపిన జనసేన కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఏడాది కాలంగా మిస్టరీగా, రాజకీయ ఆరోపణల నడుమ సాగుతున్న ఈ కేసు విచారణలో చెన్నై పోలీసులు దూకుడు పెంచారు. ఈ హత్యతో సంబంధం ఉందన్న అనుమానాలు, మృతుడి వీడియో వాంగ్మూలం ఆధారంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిని విచారించేందుకు చెన్నై పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ కేసులో ప్రాథమికంగా జనసేన మాజీ ఇన్‌ఛార్జి కోట వినుత, ఆమె భర్త కోట చంద్రబాబులను నిందితులుగా భావించినప్పటికీ, మృతుడు రాయుడు చనిపోవడానికి ముందు చిత్రీకరించిన ఒక వీడియో ఇప్పుడు విచారణను మరో మలుపు తిప్పింది. సుమారు 19.42 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రాయుడు సంచలన విషయాలను వెల్లడించారు. తనను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రలోభపెట్టారని, తన అనుచరుడు సుజిత్‌రెడ్డి ద్వారా సంప్రదింపులు జరిపారని రాయుడు ఆ వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యంగా కోట దంపతులను రోడ్డు ప్రమాదంలో అంతమొందించాలని తనపై ఒత్తిడి తెచ్చినట్లు రాయుడు చెప్పడం గమనార్హం. ఈ వీడియోనే ఇప్పుడు ఎమ్మెల్యే మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది.
గతంలో ఈ కేసులో అరెస్టయిన కోట వినుత, చంద్రబాబులు మొదటి నుంచి తాము నిర్దోషులమని వాదిస్తూనే ఉన్నారు. రాయుడు హత్యలో తమ ప్రమేయం లేదని, ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా తమను ఇరికించే ప్రయత్నమని వారు ఆరోపించారు. దీని వెనుక ఎమ్మెల్యే బొజ్జల హస్తం ఉందన్నది వారి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు రాయుడి వీడియో బయటకు రావడం, అందులో బొజ్జల పేరు ప్రస్తావనకు రావడంతో కోట దంపతుల వాదనకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలోనే కోట దంపతుల వాంగ్మూలాన్ని, రాయుడి వీడియోను సాంకేతిక ఆధారంగా తీసుకుని చెన్నై పోలీసులు ఎమ్మెల్యేను విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెం గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతేడాది జులై 7న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జులై 7న అదృశ్యమైన రాయుడి మృతదేహం మరుసటి రోజు చెన్నైలోని కూవం నదిలో తేలింది. అప్పట్లో ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు దర్యాప్తు చేపట్టి కోట వినుత దంపతులతో పాటు వారి అనుచరులు గోపి, కారు డ్రైవర్ షేక్ దాసన్, శివకుమార్లను అరెస్టు చేశారు. అయితే, ఇది కేవలం వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన హత్య కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ హస్తం ఉందన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి.
ఈ కేసులో ఇటీవల జనసేనకే చెందిన పేట చంద్రశేఖర్‌ను పోలీసులు విచారించారు. ఆయన నుంచి సేకరించిన సమాచారం, రాయుడి వీడియో, కోట దంపతుల ఆరోపణలన్నింటినీ క్రోడీకరించుకున్న చెన్నై పోలీసులు.. తదుపరి చర్యగా ఎమ్మెల్యే బొజ్జలకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. అయితే, బొజ్జల సుధీర్‌రెడ్డి మాత్రం ఈ ఆరోపణలను గతంలోనే ఖండించారు. రాయుడి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కానీ, సాక్షాధారాలు వేరేలా ఉండటంతో పోలీసుల చర్య ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
ఒక కార్యకర్త హత్య కేసులో ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే విచారణకు హాజరు కావాల్సి రావడం రాజకీయంగా ఆయనకు ఇబ్బందికర పరిణామమే. ఒకవేళ రాయుడు వీడియోలో పేర్కొన్నట్లుగా.. కోట దంపతుల హత్యకు కుట్ర జరిగిందని రుజువైతే, ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టిస్తుంది. ఇది కేవలం హత్య కేసుగానే కాకుండా, రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించేందుకు జరిగిన కుట్రగా మారే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో చెన్నై పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.






