Satyam Scam: తెరపై ‘సత్యం’ కుంభకోణం.. విడుదలకు లైన్ క్లియర్..!
భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోయిన ‘సత్యం స్కామ్’ మరోసారి చర్చనీయాంశమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించిన ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా’ డాక్యుమెంటరీ సిరీస్‌లోని ఒక ఎపిసోడ్ విడుదలపై గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బైర్రాజు రామలింగరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ పరిణామం అటు న్యాయపరంగానూ, ఇటు ఎంటర్టైన్మెంట్ రంగంలోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది.
2020లో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ పేరుతో ఒక ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందించింది. ఇందులో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సుబ్రతా రాయ్ వంటి పారిశ్రామికవేత్తలతో పాటు సత్యం రామలింగరాజుపై కూడా ఒక ఎపిసోడ్ ఉంది. అయితే, ఈ సిరీస్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, రామలింగరాజు కోర్టును ఆశ్రయించారు. సత్యం కేసులో కింది కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ, దానిపై అప్పీలు ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉందని రామలింగరాజు తరఫు న్యాయవాదులు వాదించారు. విచారణ దశలో ఉన్నప్పుడు, అర్ధసత్యాలతో కూడిన డాక్యుమెంటరీని విడుదల చేయడం పిటిషనర్ హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. అంతేకాక.. కోర్టు తీర్పును ప్రభావితం చేసే అవకాశం ఉందని అభ్యంతరం తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు 2020, సెప్టెంబరు 1న సిరీస్ విడుదలపై స్టే విధించింది.
అయితే, నెట్‌ఫ్లిక్స్ తరఫున వాదించిన న్యాయవాది బొమ్మినేని వివేకానంద బలమైన కౌంటర్ దాఖలు చేశారు. ఈ డాక్యుమెంటరీ పూర్తిగా పబ్లిక్ రికార్డులు, లిఖితపూర్వక ఆధారాల మీదే రూపొందించబడిందన్నారు. పిటిషనర్ వ్యక్తిగత జీవితంపై కాకుండా, జరిగిన చారిత్రక మోసాన్ని ప్రజలకు తెలియజేయడమే దీని లక్ష్యమని వాదించారు. సుదీర్ఘ విచారణ అనంతరం, ఇంజంక్షన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, డాక్యుమెంటరీ విడుదలను అడ్డుకునే హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది.
నేటి తరానికి అంతగా పరిచయం లేని, భారత ఐటీ రంగాన్నే కుదిపేసిన కుంభకోణం ఇది. 2009 జనవరి 7న రామలింగరాజు స్వయంగా రాసిన ఒక లేఖతో ఈ డొంక కదిలింది. అప్పటి వరకు దేశంలోనే నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీగా వెలుగొందుతున్న సత్యం కంప్యూటర్స్ లాభాలను, నగదు నిల్వలను ఏళ్ల తరబడి పెంచి చూపించామని ఆయన అంగీకరించారు. దాదాపు రూ. 7,000 కోట్లకు పైగా అవకతవకలు బయటపడటంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. దీనిని “భారతదేశపు ఎన్రాన్”గా అప్పట్లో వ్యవహరించారు. వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. లక్షలాది మంది ఇన్వెస్టర్లు తమ సంపదను కోల్పోయారు. ఆ తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, టెక్ మహీంద్రా సంస్థ సత్యంను టేకోవర్ చేయడం చకచకా జరిగిపోయాయి.
ఈ తీర్పును కేవలం ఒక డాక్యుమెంటరీ విడుదలకు అనుమతిగా మాత్రమే చూడలేం. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు వైపు న్యాయస్థానం మొగ్గు చూపినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక నేరాలు, ప్రజాధనంతో ముడిపడి ఉన్న అంశాలపై కథనాలు రాసేటప్పుడు లేదా డాక్యుమెంటరీలు తీసేటప్పుడు.. సంబంధిత వ్యక్తులు విచారణను అడ్డుపెట్టుకుని అడ్డుకోవడం సరికాదని ఈ తీర్పు పరోక్షంగా స్పష్టం చేస్తోంది. పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని, జరిగిన వాస్తవాలను క్రోడీకరించి చూపించడం పరువు నష్టం కిందికి రాదని, అది ప్రజలను చైతన్యం చేయడమేనని నెట్‌ఫ్లిక్స్ వాదన నెగ్గడం గమనార్హం.
తాజా తీర్పుతో నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల వల్ల ఎంతటి అనర్థాలు జరుగుతాయో, ఒక వ్యక్తి అత్యాశ వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకోవడానికి ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడుతుందని భావించవచ్చు. మొత్తానికి, ఐదేళ్ల తర్వాత సత్యం కుంభకోణం మరోసారి స్క్రీన్ మీద చర్చకు రాబోతోంది.






