తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా బక్కని నర్సింహులు

తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులును నియమించారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బక్కని నర్సింలు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విస్తరణ కోసం, కార్యకర్తల కోసం పనిచేస్తానని ప్రకటించారు. గతంలో ఈయన షాద్‌నగర్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, ఆ ఫలాలను ప్రస్తుతం సీఎం కేసీఆర్, జగన్ అనుభవిస్తున్నారని అన్నారు. దళితులకు టీడీపీలోనే న్యాయం జరుగుతుందని, మూడెకరాల భూమి దళితులకంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి, మోసం చేశారని దుయ్యబట్టారు. వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసమే నేతలు టీడీపీని వీడుతున్నారని, కార్యకర్తలు మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారని అన్నారు. హుజూరాబాద్ పోటీ విషయం చంద్రబాబు నిర్ణయానికే వదిలేస్తున్నామని బక్కని నర్సింలు అన్నారు. మొన్నటి వరకూ టీటీడీపీ అధ్యక్షునిగా ఎల్. రమణ కొనసాగారు. ఇటీవలే ఆయన టీడీపీకి రాజీనామా చేసి, అధికార టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.