Mallareddy: ఏపీలో అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారు : మల్లారెడ్డి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) బాగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రధాని మోదీ (Modi) రూ.లక్షల కోట్లు కేటాయిస్తున్నారని తెలిపారు. అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారన్నారు. నా పుట్టినరోజు నాడు ఏటా స్వామి వారి దర్శనానికి వస్తుంటా. గతేడాది యూనివర్సిటీలు కావాలని కోరుకున్నా. దేశంలోనే 3 పెద్ద డీమ్డ్ వర్సీటీలు నడిపిస్తున్నా. తెలంగాణలో బీఆర్‌ఎస్ (BRS) హయంలో పదేళ్లలో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధిని కేసీఆర్ చేశారు. హైదరాబాద్‌కు మల్లీ నేషనల్ కంపెనీలను కేటీఆర్ తీసుకొచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముకుని హైదరాబాద్ వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అవుతోంది. తెలంగాణ వాళ్లు ఏపీలో ఆస్తులను కొని వ్యాపారాలు చేస్తున్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే పాతరోజులు వస్తాయి అని అన్నారు.