Kathamandu: రణరంగంలా నేపాల్.. ప్రధాని ఓలీ రాజీనామా.. సైన్యం చేతుల్లోకి పగ్గాలు..!

హిమాలయ దేశం నేపాల్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. నేపాల్ (Nepal)లో ఉద్రిక్తతలు ఆగడం లేదు.పరిస్థితి అదుపుకాకపోవడంతో ముందుగా హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో… ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దీంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లాయి.
దీనికి ముందు ప్రధాని కేపీ శర్మ ఓలీ (K P Sharma Oli) నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో సమావేశమయ్యారు. క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు, ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీకి ఆర్మీ చీఫ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలను సైన్యం అదుపులోకి తీసుకువస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. ఓలీ రాజీనామా చేస్తే.. మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ తరుణంలోనే రాజీనామా ప్రకటన వెలువడింది.
ఆర్మీ బ్యారక్స్‌కు వీఐపీలు..
దేశంలోని అస్థిర పరిస్థితుల వేళ (Nepal Protest).. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలను రద్దు చేశారు. 300 మంది సైనికులను అక్కడ మోహరించారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద హెలికాప్టర్ల కదలికలు కనిపిస్తున్నాయి. అలాగే రాజధాని కాఠ్‌మాండూలోని ఆర్మీ బ్యారక్స్‌లోకి వీఐపీలను తరలిస్తున్నారు.
పార్లమెంట్‌లోకి చొరబడిన నిరసనకారులు..
సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ (Nepal)లో జరిగిన ఆందోళనల్లో అత్యధికమంది యువత, పాఠశాల విద్యార్థులే పాల్గొన్నారు. దీంతోపాటుగా రాజకీయ వారసత్వాలపై నిరసనలు కూడా మొదలయ్యాయి. వీటిని నెపోకిడ్ మూమెంట్‌గా పిలుస్తున్నారు. సంపన్న వర్గాల, రాజకీయ నాయకుల పిల్లలు అవినీతి సొమ్ముతో వచ్చే ఫలాలను అనుభవిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చి.. నిరసనకారులు పార్లమెంట్‌లోకి దూసుకువెళ్లారు. ఆ భవనానికి నిప్పంటించారు. మరోపక్క భక్తాపుర్‌లోని కేపీ శర్మ ఓలీ వ్యక్తిగత నివాసానికి నిప్పుపెట్టిన నిరససకారులు.. అది కాలిపోతుంటే డ్యాన్సులు చేస్తోన్న దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.