Group 1: రేవంత్ సర్కార్‌కు ఎదురు దెబ్బ.. గ్రూప్-1 మెయిన్స్ రద్దు..!!

తెలంగాణ గ్రూప్-1 (Group 1) ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పు చెప్పింది. గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయంటూ కొంతమంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ తీర్పు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)కి హైకోర్టు రెండు ఆప్షన్లను కోర్టు సూచించింది. అభ్యర్థులందరి ఆన్సర్ షీట్లను మాన్యువల్‌గా మళ్లీ మూల్యాంకనం (valuation) చేయాలని సూచించింది. సాధ్యం కాకపోతే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం మళ్లీ మెయిన్స్ పరీక్ష (Group 1 mains) నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేకుంటే మొత్తం మెయిన్స్ పరీక్ష రద్దు చేయాల్సి ఉంటుందని తెలిపింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక ఎదురు దెబ్బగా మారింది.
563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం TGPSC 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 9, 2024న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో సుమారు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. 31,383 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకూ మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మార్చి 10న మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును మార్చి 30న ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, పరీక్ష నిర్వహణ, ఆన్సర్ షీట్ల మూల్యాంకనంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
తెలుగు మీడియంలో రాసిన ఆన్సర్ షీట్లను తెలుగు రానివాళ్లతో దిద్దించారని, దీని వల్ల తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కొంతమంది అభ్యర్థులకు రీ-కౌంటింగ్‌లో మార్కులు తగ్గినట్లు గుర్తించారు. ఒక అభ్యర్థికి మొదట 482 మార్కులు రాగా రీవాల్యుయేషన్ లో 422కి తగ్గాయని కోర్టుకు వివరించారు. వీటితో పాటు రెండు హాల్ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాల కేటాయింపులో అక్రమాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో లోపాలు, కొన్ని కేంద్రాల్లో అసాధారణ ఫలితాలు వంటి సాంకేతిక లోపాలను కూడా పిటిషనర్లు ఎత్తిచూపారు. ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. జులైలో వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది.
ఇవాళ జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు ధర్మాసనం తీర్పును వెలువరించింది. మార్చి 10న ప్రకటించిన మెయిన్స్ ఫలితాలు, మార్చి 30న విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మూల్యాంకన ప్రక్రియలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని కోర్టు గుర్తించింది. అందువల్ల అన్ని ఆన్సర్ షీట్లను మాన్యువల్‌గా, మోడరేషన్ పద్ధతిని అనుసరించి పునఃమూల్యాంకనం చేయాలని TGPSCని ఆదేశించింది. ఈ ప్రక్రియ ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని, లేకుంటే మొత్తం మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తామని తెలిపింది. దీంతో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తాత్కాలికంగా ముగిసింది. అయితే ఇప్పటికే సెలెక్ట్ అయిన అభ్యర్థులు, హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.