Sudhan Gurung: జెన్ జీ ఉద్యమంతో ఊగిపోతున్న నేపాల్.. ఉద్యమసారథి సుదన్ గురుంగ్ ప్రస్థానం…?

నేపాల్‌లో 26 సామాజిక మాధ్యమాలపై నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ నేపాలి యువత నిర్వహిస్తున్న ఆందోళనలు .. ప్రభుత్వాన్ని కుప్పకూల్చాయి. వీధుల్లోకి వచ్చిన యువత.. సైన్యం, పోలీసుల అణచివేతను ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు. పోలీసుల దుందుడుకు చర్యలతో కనీసం 20మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. హోంశాఖ మంత్రి రమేష్ లేఖర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ నిషేధంపై వెనక్కి తగ్గింది. అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంది. తాజాగా అనారోగ్య కారణాలతో ఆ దేశ ప్రధాని కేపీ శర్మా ఓలీ (KP Sharma Oli) దేశాన్ని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థాయి ఉద్యమానికి ఓ వ్యక్తి నాయకత్వం వహించాడు. అతడే 36 ఏళ్ల సుదన్ గురుంగ్ (Sudan Gurung)..!
అతడి నేతృత్వంలో నిర్వహించే హమి నేపాల్ (Nepal) అనే ఎన్జీవో సంస్థ ఈ ఆందోళనను ముందుండి నడిపించింది. తమ గ్రూపు ప్రదర్శనలు నిర్వహించేందుకు… విద్యార్థులు యునిఫామ్‌లో ఉండేందుకు, పుస్తకాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వాన్ని తామే అనుమతి కోరినట్లు ఇన్‌స్టా పోస్టులో వెల్లడించింది. రోడ్లను ప్రభుత్వ దళాలు బ్లాక్ చేస్తుండటంతో ఈ సంస్థే విద్యార్థులకు ఆందోళన చేయాల్సిన మార్గాలను, సురక్షిత జాగ్రత్తలను సూచిస్తోంది.
ఎవరీ సుదన్..?
సుదన్ గురంగ్ (Sudan Gurung) ‘హమి నేపాల్’ సంస్థకు అధ్యక్షుడు. 2015లో వచ్చిన భారీ భూకంపం తర్వాత ఈ సంస్థను స్థాపించారు. ఆ విపత్తులో తన బిడ్డను కోల్పోయాడు. ఈ ఘటన అతడి జీవితాన్ని మార్చి ఎన్‌జీవో వైపు తీసుకొచ్చింది. అంతకుముందు సుదన్ ఓ ఈవెంట్ మేనేజర్. పార్టీలను ప్లాన్ చేసి నిర్వహించేవాడు. భూకంపం తర్వాత సహాయ, పౌర సేవా కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. గతంలో బీపీ కొయిరాల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పారదర్శకత కోరుతూ ఘోప క్యాంప్ పేరిట ఆందోళనలు చేశారు. సామాజిక మాధ్యమాల నిషేధంతో మొదలైన ఉద్యమంలో డిజిటల్ యుగపు యువత ఆగ్రహాన్ని సుదన్ క్రమబద్ధీకరించారు.
యువత, విద్యార్థులే ఆయుధం..
నేపాల్ (Nepal)లో జరిగిన ఆందోళనల్లో అత్యధికమంది యువత, పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారు. తక్షణం సామాజిక మాధ్యమాలపై బ్యాన్ తొలగించాలని కోరారు. ఇవికాస్తా హింసాత్మకంగా మారడంతో వీరంతా పార్లమెంట్ కాంప్లెక్సులోకి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిపై జలఫిరంగులు, భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. చివరికి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఆందోళనలు పోఖార, బుట్వాల్, భైరహ్వా, భరత్‌పుర్, ఇటాహారి, దమక్ ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో చాలాచోట్ల కర్ఫ్యూ విధించారు.