BRS: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం… వ్యూహాత్మకమా..?

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు (vice president elections) దూరంగా ఉండాలని బీఆర్ఎస్ (BRS) నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహాలు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలు, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పాత్ర.. తదితర ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. అటు బీజేపీకి (BJP), ఇటు కాంగ్రెస్ (Congress) కు సమాన దూరం పాటించాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతోంది. బీజేపీ కూటమి అభ్యర్థికి ఓటేసినా, ఇండియా కూటమి (INDIA Alliance) అభ్యర్థికి ఓటేసినా విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం ఖాయం. అందుకే వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఉప రాష్ట్రపతి ఎన్నిక రేపు జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు రాజ్యసభలో నలుగురు సభ్యులున్నారు. బీఆర్ఎస్ పాత్ర ఈ ఎన్నికల్లో స్వల్పమే. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు వేసినా, వేయకపోయినా పెద్ద నష్టం ఉండదు. ఇది నిర్ణాయక శక్తి కాదు. అయితే ఆ పార్టీ వైఖరిని ఇది నిరూపించే పరిస్ధితి ఉండేది. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉంటుందని ప్రకటించారు. తెలంగాణలోని రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యకు నిరసనగా తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి పలు రాజకీయ మరియు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. మొదటిగా, తెలంగాణలో కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ రాజకీయ పోరాటం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటప్పుడు ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతుగా నిలిస్తే రాష్ట్రంలో విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తే.. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధానికి ఇది నిదర్శనం అని కాంగ్రెస్ విమర్శించే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ స్వతంత్ర రాజకీయ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది.
అయితే ఈ ఎన్నికను బహిష్కరించడం ద్వారా బీఆర్ఎస్ కొన్ని విమర్శలకు కూడా తావు ఇచ్చే అవకాశం ఉంది. జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. సొంత రాష్ట్ర వ్యక్తి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉన్నా కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదనే విమర్శలను ఆ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తెలుగు ఎంపీలంతా సుదర్శన్ రెడ్డికి ఓటేయాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందనే ఆరోపణలున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో లోపాయకారీగా బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ ఎంతోకాలంగా విమర్శిస్తోంది. ఇప్పుడు ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
అయితే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఒక వ్యూహాత్మక రాజకీయ చర్యగా కనిపిస్తుంది. ఇలా చేయడం ద్వారా బీఆర్ఎస్ తమ స్వతంత్ర గుర్తింపును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో రైతుల సమస్యలను హైలైట్ చేయడానికి కృషి చేస్తోంది.