Konijeti Roshaiah: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య (Konijeti Roshaiah) సతీమణి శివలక్ష్మి (Shivalakshmi) (86) హైదరాబాద్ అమీర్‌పేటలోని తమ నివాసంలో మృతి చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వేమూరుకు చెందిన లక్ష్మయ్య, మాణిక్యమ్మలకు 1950, జూన్ 4న శివలక్ష్మి జన్మించారు. కొణిజేటి రోశయ్యతో ఆమె వివాహం జరిగింది. రాజకీయరంగంలో నిత్యం తలమునకలై ఉండే రోశయ్యకు ఆమె అడుగడుగునా అండగా నిలిచేవారు.
శివలక్ష్మి మరణవార్త తెలియగానే పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు, కార్యకర్తలు రోశయ్య నివాసానికి తరలివచ్చారు. పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళులర్పించారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, వి.హన్మంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, డాక్టర్ కోట నీలిమ, ఏఐసీసీ జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ పీవీ రవిశేఖర్ రెడ్డి, తెలంగాణ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్ పరిధిలోని రోశయ్యకు చెందిన ఫామ్‌హౌ్‌సలో ఆమె దహన సంస్కారాలను నిర్వహించారు.






