MSG: చిరంజీవి కొత్త సినిమా పైరసీ కలకలం
చిత్ర పరిశ్రమకు కుదిపేసే అంశాల్లో పైరసీ మొదటి స్థానంలో ఉంటుంది. సినిమా రిలీజైన గంటల వ్యవధిలోనే మూవీ ఆన్లైన్ లోకి పైరసీ ద్వారా అందుబాటులోకి రావడం, దాన్ని చూసి కొంతమంది ఆడియన్స్ ఎంకరేజ్ చేయడం ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతూనే వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దీన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు.
ఎంతో ఖర్చు పెట్టి తమ జీవితాలను పణంగా పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తుంటారు. పెట్టిన బడ్జెట్ ను రికవరీ చేసుకోవడానికి వాళ్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అలాంటి నిర్మాతల ఆశలకు పైరసీ అడ్డుకట్ట వేస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఈ పైరసీ భూతం ద్వారా దెబ్బతినగా, పైరసీ వల్ల తమ సినిమాలకు సరైన ఆడియన్స్ రాక ఎంతో మంది నిర్మాతలు నష్టపోయారు కూడా.
అయితే ఇప్పుడీ పైరసీ భూతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాను సైతం వదల్లేదు. అనిల్ రావిపూడి(Anil ravipudi) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నయనతార(nayanthara) హీరోయిన్ గా వచ్చిన తాజా సినిమా మన శంకరవరప్రసాద్ గారు(Mana Shanakaravaraprasad Garu) మూవీకి కూడా ఇప్పుడు పైరసీ వచ్చేసింది. జనవరి 12న రిలీజైన ఈ సినిమా కు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ వచ్చిందనే ఆనందంలో ఉన్న మేకర్స్ కు ఇప్పుడీ వార్త ఆందోళనను కలిగిస్తోంది. ఈ పైరసీ వల్ల సినిమా కలెక్షన్లు దెబ్బతినే అవకాశముందనేది వాస్తవం.






