Raja Saab: ప్రభాస్ గారిని కొత్తగా చూపించాననే ప్రశంసలు వస్తున్నాయి – డైరెక్టర్ మారుతి
టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” మూవీ. ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్సటైల్ పర్ ఫార్మెన్స్ తో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి టేకింగ్. అన్ కాంప్రమైజ్డ్ గా గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో “రాజా సాబ్” సక్సెస్ హ్యాపీనెస్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నారు డైరెక్టర్ మారుతి.
– “రాజా సాబ్” సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. సంక్రాంతి హాలీడేస్ బిగిన్ కాకముందే ఈ సినిమా 200 కోట్ల రూపాయల మార్క్ టచ్ చేయడం హ్యాపీగా ఉంది. మా సినిమా ప్రేక్షకులకు నచ్చడం వల్లే బాక్సాఫీస్ వద్ద ఇంత హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సంక్రాంతి హాలీడేస్ లో మరింతగా మా మూవీకి ప్రేక్షకాదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. సైకలాజికల్ ఎలిమెంట్స్ తో కొత్త పాయింట్ చూపించాం కాబట్టి ప్రేక్షకులకు రీచ్ కావడానికి కొంత టైమ్ పడుతుందని ముందే అనుకున్నాం. ప్రభాస్ గారు కూడా ప్రశాంతంగా ఉండు డార్లింగ్, మనం కొత్త ప్రయత్నం చేశాం. కొంత టైమ్ పడుతుంది ఆడియెన్స్ కు చేరడానికి అని చెప్పారు. రీసెంట్ గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా, ఆ సీన్స్ అన్నీ పర్పెక్ట్ గా సెట్ అయ్యాయని చెప్పారు.
– సంక్రాంతి మూడ్ లో ఉంటారు కాబట్టి ప్రేక్షకులు అలాంటి ఒక లైటర్ వేన్ సినిమా ఎక్స్ పెక్ట్ చేసి ఉంటారు. ఈ కథలో బొమన్ ఇరానీ పాత్ర ఎంటరైనప్పటి నుంచి సైకలాజికల్ గా టర్న్ అవుతుంది. ఆ సీన్స్ వెనక మేము అనుకున్న కాన్సెప్ట్ కొందరికి సులువుగా అర్థం కాకపోయి ఉండొచ్చు. హారర్ మూవీస్ లో దెయ్యాన్ని చంపడం ఈజీ. ఎలాగైనా చంపొచ్చు. కానీ ప్రభాస్ గారి లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి సాదా సీదా హారర్ కామెడీ చేయొద్దనే ఇలా ఫాంటసీ, సైకలాజికల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బిగ్ స్కేల్ మూవీ చేశాం. సినిమా రిలీజైన సెకండ్ డే ప్రెస్ మీట్ లో నేను మా మూవీకి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ఎవరు ఎలా అనుకుంటున్నారు అనేది క్లియర్ గా చెప్పా. ఈ సోషల్ మీడియా ట్రెండ్ లో ఎందుకు దాచడం.
– ఇప్పుడు రాజా సాబ్ మూవీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా బాగుందంటూ వాళ్లే మెసేజ్ లు పంపుతున్నారు. మీరు ఫస్ట్ టైమ్ మూవీ చూసినప్పుడు మీకు కావాల్సిన ఎలిమెంట్స్ వెతుక్కుంటారు. కానీ సెకండ్ టైమ్ మూవీ చూస్తే ఎంత డెప్త్ గా ఆలోచించే ఈ సీన్ చేశారు అనేది అర్థమవుతుంది. రాజా సాబ్ లాంటి సినిమా చేయడం సులువు కాదు. ఒక వ్యక్తి ట్రాన్స్ లోకి వెళ్లాడు అనేది విజువల్ గా చూపించడం కష్టం. అతని సబ్ కాన్షియస్ మైండ్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. ఈ మూవీలోని ఓల్డ్ గెటప్ లో రివర్స్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం. కొన్ని సీన్స్ కోసం ప్రభాస్ గారు 15 డేస్ ఎలా చేద్దామని ఆలోచించారు. నువ్వు ఇంత గ్రేట్ సీన్ రాశావు డార్లింగ్, నేనూ నా వందశాతం ఎఫర్ట్స్ పెట్టాలి కదా అని ఆయన అనేవారు. జోకర్ సీన్ లో ఆయన చిన్న స్మైల్ ఇస్తారు. ఆ స్మైల్ తో గ్రేట్ పర్ ఫార్మ్ చేశారు అనిపించింది.
– ప్రభాస్ గారి అభిమానులు నాకు సోదరులు. వారే ఫోన్స్ , మెసేజ్ లు చేస్తూ అభినందిస్తున్నారు. ప్రభాస్ గారిని కలర్ ఫుల్ గా సాంగ్స్, డ్యాన్స్ లతో చూపించారని, కొత్తగా ప్రెజెంట్ చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది నాకు పర్సనల్ గా విష్ చేశారు. నాగ్ అశ్విన్ గారు, సందీప్ వంగా గారు రాజా సాబ్ కు సపోర్ట్ చేశారు.
– ఈ మొత్తం ప్రాసెస్ లో నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. అందుకే సినిమా రిలీజైన రెండో రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడాను. నాకు అనుకున్న టైమ్ కు సినిమా రిలీజ్ చేయాలి అనే వర్క్స్ లోనే టెన్షన్ పడుతూ ఉండిపోయా. అందుకే నేను రిలీజ్ కు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో అలసిపోయినట్లు కనిపించాను. ఏ సినిమా గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ రాలేదో చెప్పండి. ప్రతి సినిమాకు వస్తుంటాయి. నలుగురు చెడుగా మాట్లాడితే నలభై మంది వెళ్లి సినిమా చూస్తున్నారు. సినిమా బాగుంది కదా అని అంటున్నారు. ప్రీమియర్ షోస్ కు అనుమతి, బుకింగ్స్ ఇలాంటివి నా పరిధిలోకి రావు. నేను సినిమాను ఇన్ టైమ్ రిలీజ్ కు రెడీ చేసే పనిలోనే ముగినిపోయాను.
– రాజా సాబ్ సినిమాకు ఇంత భారీ కలెక్షన్స్ వస్తున్నాయంటే ప్రభాస్ గారిని కొత్త జానర్ లో యాక్సెప్ట్ చేసినట్లే కదా. బీ, సీ సెంటర్స్ లో కూడా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ను లో ఎక్స్ పెక్టేషన్స్ లో ఉంచాలనే ఇంట్రో సీన్ నుంచి ప్రయత్నించాం. క్లైమాక్స్ లో కూడా వందమందిని పెట్టి ఫైట్ చేయించొచ్చు. అలా చేస్తే మళ్లీ రొటీన్ అని అంటారు. నేను ఒక పెద్ద స్టార్ తో కూడా సినిమా బాగా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాను. సీజీ వర్క్స్ విషయంలో కొన్ని నేర్చుకున్నాను. ప్రతిరోజు పండగే సినిమాను 40 రోజుల్లో రాసిన నేను…ఈ చిత్రంలో కొన్ని సీన్స్ కోసం రెండు నెలల టైమ్ తీసుకున్నా. అలా రాజా సాబ్ సినిమా నాకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది.
– ప్రస్తుతం రాజా సాబ్ సినిమానే నా ఆలోచనల్లో ఉంది. చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తే నా లైఫ్ సర్కిల్ ఫుల్ అయినట్లు భావిస్తా. ఆయన అభిమానిని నేను. ప్రేక్షకులు మా మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ప్రశాంతంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నా. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి.






