Nara Lokesh: అవినీతి పై తమ వారైన మినహాయింపు లేదు.. నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం..
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ (Nara Lokesh) రాజకీయాల్లో తనదైన ప్రత్యేక దారిని ఎంచుకుంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu)తో పోలిస్తే లోకేష్ మరింత దూకుడుగా, ఆధునిక ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు అంటే ప్రత్యర్థులపైనే విమర్శలు చేయడం, తమ వారిపై వచ్చినప్పుడు నిశ్శబ్దంగా వదిలేయడం అన్నది అన్ని పార్టీల్లో కనిపించే సాధారణ సంస్కృతి. కానీ ఈ సంప్రదాయాన్ని తొలిసారిగా ప్రశ్నిస్తూ, ఎవరి మీద ఆరోపణ వచ్చినా విచారణ తప్పనిసరిగా జరగాలనే ఆలోచనతో లోకేష్ ముందడుగు వేస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో పాలన పారదర్శకంగా ఉండాలన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. అధికారంలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా ఆరోపణలు వస్తే వాటిని తేలికగా తీసుకోకుండా, నిజానిజాలు బయటకు తేవాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రణాళికను త్వరలోనే అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు మీడియా కథనాలకే పరిమితమైన విమర్శలు ఇకపై నేరుగా ప్రజల నుంచి వినిపించేలా చేయాలని ఆయన భావిస్తున్నారు.
ఈ కొత్త విధానంలో భాగంగా ప్రజలు తమ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనున్నారు. ఎమ్మెల్యే గానీ, ఆయన అనుచరులు గానీ చేసే తప్పుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఎలాంటి భయం లేకుండా పార్టీకి తెలియజేయవచ్చని లోకేష్ భరోసా ఇస్తున్నారు. ఇటీవల కాలంలో అధికార పార్టీ ప్రతినిధులపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో పార్టీకి నష్టం కలగకముందే తప్పులను సరిదిద్దుకోవడం మంచిదనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ ఏర్పాటు చేయనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ నంబర్‌కు ఎవరైనా కాల్ చేసి తమ సమస్యలను వివరించవచ్చు. ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు, ఫోన్ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇవ్వడం ఈ విధానానికి మరింత విశ్వసనీయతను తీసుకువస్తోంది. ఇలా అందిన సమాచారం నేరుగా సంబంధిత స్థాయికి చేరి, అవసరమైన చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు.
కేవలం ఎమ్మెల్యేలకే కాదు, ప్రభుత్వ అధికారుల పనితీరు, అవినీతి ఆరోపణలపై కూడా ప్రజలు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. విచారణలో తప్పు నిరూపితమైతే హోదా చూడకుండా చర్యలు ఉంటాయని పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదని, ప్రజల చేతికే ఒక శక్తివంతమైన ఆయుధం ఇచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని, పాలన మరింత జవాబుదారీతనంతో సాగుతుందని లోకేష్ భావిస్తున్నారు.






