రేవంత్ పై ధ్వజమెత్తిన బిజెపి నేత ఈటల..

తెలంగాణలో ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ సర్కారు ఏర్పడింది. ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ మెల్లిగా కొన్ని వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై కేసీఆర్ తో పాటు బీజేపీ పార్టీ నేతలు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత ఈటల రాజేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రూలింగ్ లోకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో ప్రజల చేత ఛీ అనిపించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈటల ఎద్దేవా చేశారు. వరంగల్లో మీడియాతో ముచ్చటించిన ఈటల.. అతి తక్కువ కాలంలో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అని ఆరోపించారు. తెలంగాణలో ఆర్ఆర్ (RR) టాక్స్ వసూలు చేస్తున్నారని నేరుగా ప్రధాని, హోంమంత్రి చెప్పారని.. దీన్నిబట్టి రాష్ట్రంలో ఏమి జరుగుతుందో తెలంగాణ వాసులు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నేతలు అధికార దాహంతో పాటు చాలా ఆకలి మీద ఉన్నారని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పటి వరకు అధికారంలో ఉంటారో తెలియదు కాబట్టి ఇప్పుడే అంతా సర్దిపెట్టుకుంటున్నారని ఈటల వ్యాఖ్యానించారు. గ్రేటర్ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్ల కోసం కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫీజు కట్టించుకుంటుందని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సైడ్ టాక్స్ లు వసూలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు వస్తుందని.. తెలంగాణకు మంచి జరుగుతుంది అని భావించి ప్రజలు రేవంత్కు సీఎం పదవిని బిక్షగా పెట్టారని.. అటువంటి ప్రజలను దెబ్బ కొడితే కాలగర్భంలో కలిసి పోవాల్సిందే అని ఈటల అన్నారు. పదవిలోకి రావడానికి ముందు పథకాల పేరుతో రేవంత్ సర్కార్ ప్రజలను ఎంతగానో మభ్యపెట్టింది.. కానీ పదవిలోకి వచ్చిన తరువాత పథకాలను పక్కదోవ పట్టిస్తూ అందరికీ ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారు అని ఈటల పేర్కొన్నారు.