నీళ్ల నిపుణుడు ఇక లేరు
తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు (77) కన్ను మూశారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గత కొద్ది రోజులుగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు బతికించుకొనేందుకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించినా, ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. విద్యాసాగర్ రావు భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి హబ్సిగూడలోని ఆయన నివాసానికి అంబులెన్స్‌లో తరలించారు. అంబర్‌పేట శ్మశనవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు వెల్లడించారు. నల్గొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలో జన్మించిన విద్యాసాగర్ రావు నీటిపారుదల రంగంలో అపార అనుభవం గడించారు. కేంద్ర జలసంఘంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. సాగునీటి రంగంపై పలు పుస్తకాలు రచించారు. నీళ్లు- నిజాలు పేరిట ఎన్నో వ్యాసాలు రాశారు. ఐరాస పర్యావరణ కార్యక్రమానికి సలహాదారుగా విధులు నిర్వర్తించారు.













