బీజేపీ నేత వెంటనే క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ డిమాండ్

బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీపై బెంగాల్‌కు చెందిన ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నేత వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే కాకుండా.. ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే తదుపరి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. కాగా.. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయ ప్రస్తుతం బెంగాల్‌లోని తమ్లూక్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మమతా బెనర్జీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘సందేశ్‌ఖాలీ అభ్యర్థిని రేఖా పాత్రని బీజేపీ రూ.2000కి కొనుగోలు చేసిందని టీఎంసీ అంటోంది. మరి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతకు అమ్ముడు పోతున్నారు? మీ రేటు రూ.10 లక్షలా..?’’ అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది.
ఇదే వీడియోను టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సాకేత్ గోఖలే ఎక్స్ వేదికగా పోస్ట్ చేయగా.. దానిని రీ పోస్ట్ చేసిన కేటీఆర్.. ‘‘మమత బెనర్జీపై ఈ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు దారుణం. అసహ్యకరమైన, పూర్తిగా ఆమోదయోగ్యం కాని పదాలు వాడారు. సిగ్గుచేటు కలిగించే ఆయన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేకపోతే తదుపరి పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పోస్ట్‌లో ఎన్నికల కమిషన్‌ను కూడా కేటీఆర్ ట్యాగ్ చేశారు.