Dharmapuri Arvind: రేవంత్‌ను మార్చాలని కాంగ్రెస్ అధిష్ఠానం ప్లాన్: ధర్వపురి అర్వింద్

తెలంగాణలో అసమర్థ, అవినీతి, అబద్ధాల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని, పరిపాలన పూర్తిగా జీరో స్థాయిలో ఉందని ఆయన ఆరోపించారు. ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం పుష్ప, హైడ్రా, మూసీ, హెచ్‌సీయూ వంటి వాటిపై దృష్టి సారించిందే తప్ప, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అర్వింద్ (Dharmapuri Arvind) మాట్లాడుతూ ప్రభుత్వ పాలన తీరును దుయ్యబట్టారు.
“ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, విద్యా భరోసా కార్డు, చేయూత, ఆరోగ్యశ్రీ, లక్ష రూపాయలు, తులం బంగారం వంటి ఎన్నికల వాగ్దానాలన్నింటినీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదు, కనీసం ఒక చిన్న నీటి తూమును కూడా నిర్మించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) ప్రజల్లో నమ్మకం క్షీణిస్తోంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన ఉన్న అవినీతిపరులే ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ చేరారు. ఒకప్పుడు కేసీఆర్ జైలులో పెట్టిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు కనీసం ఆ విషయం గురించి పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షం ఫామ్‌హౌస్‌లో నిద్రపోతోంది. ప్రతిపక్ష పదవిని ఎందుకు స్వీకరించారో అర్థం కావడం లేదు. కేసీఆర్ వ్యవస్థను నాశనం చేసి దోచుకున్నారు.
ఇప్పుడు ప్రజల్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భయభ్రాంతులకు గురిచేస్తున్నారు, బుల్డోజర్లను పంపిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ నాయకులను అడుగు పెట్టనివ్వనని రేవంత్ రెడ్డి అహ్మదాబాద్‌లో అన్నారు. కానీ, తాజాగా మల్క కొమురయ్య, అంజిరెడ్డి వంటి వారు రాష్ట్రంలో అడుగు పెట్టారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపడం తప్ప, అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రేవంత్ రెడ్డి పనితీరు పట్ల ఆ పార్టీ అధిష్ఠానమే అసంతృప్తిగా ఉంది. ఆయన్ను మార్చాలని చూస్తోంది” అని అర్వింద్ (Dharmapuri Arvind) పేర్కొన్నారు.