మోదీ మళ్లీ వస్తే రాజ్యాంగం అంతమవుతుంది : డిప్యూటీ సీఎం భట్టి

దేశంలో బీజేపీ మరోసారి గెలిస్తే రాజ్యాంగం అంతమవుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలు కనుమరుగవుతాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. బీజేపీ కేవలం మత రాజకీయాలే అజెండాగా పనిచేస్తుందని, హిందూ, ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప ఆ పార్టీకి మరో అజెండా లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం నాడు భట్టి విక్రమార్క ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఇండియా కూటమి ఏర్పడిందని, తామంతా మూకుమ్మడిగా కలిసి నియంతృత్వ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీ గెలిస్తే రాజ్యాంగం అంతమైపోతుంది. ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతిని నియంతృత్వ పరిపాలన మొదలవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలే ఉండవు. రిజర్వేషన్లు రద్దైపోతాయి. ధరలు పెరిగిపోతాయి. ప్రజల జీవితం అస్తవ్యస్తమైపోతుంది. అందుకే ప్రజలంతా ఆలోచించి ఇండియా కూటమికే ఓటేయండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.