ఈటల విషయంలో కేసీఆర్ తొందరపడ్డారా?

రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మాటలు, చర్యలు సందర్భానుసారం మారిపోతుంటాయి. ఒక్కోసారి అవే ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. పార్టీకి కిరాయిదారులం కాదు.. ఓనర్లం అంటూ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ టీఆర్ఎస్ లో తీవ్ర కలకలం రేపాయి. సహజంగానే పార్టీ అధినేత కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించి ఉంటాయి. అప్పటి నుంచి ఈటల రాజేందర్ ను దూరం పెట్టారు కేసీఆర్. సమయం కోసం వేచి చూస్తున్న కేసీఆర్. ఇప్పుడు ఈటలపై ఆక్రమణ అంశాన్ని తెరపైకి తెచ్చి ఆఘమేఘాలపై విచారణ జరిపించి ఈటలను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేశారు. అయితే ఈటలపై కేసీఆర్ తూటా మిస్ ఫైర్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేసీఆర్ కూడా ఈటల రాజేందర్ ను తమ్ముడిలా చూసుకున్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు, ఈటల ఎమ్మెల్యేగా రాష్ట్రంలో కీలక పాత్ర పోషించారు. వై.ఎస్.హయాంలో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ చేసినా.. ఈటల మాత్రం తలొగ్గలేదు. ఆ తర్వాత కూడా పార్టీ మాట జవదాటడం కానీ, అవినీతి ఆరోపణలు కానీ ఈటలపై ఎప్పుడూ రాలేదు. అయితే ఇప్పుడు అనూహ్యంగా అసైన్డ్ ల్యాండ్ ను ఆక్రమించారనే ఆరోపణలపై ఈటలను టార్గెట్ చేశారని భావిస్తున్నారు. అయితే అవినీతి, అక్రమాల ఆరోపణలు ఈటలపై అనూహ్యంగా తెరపైకి వచ్చినవే కానీ ఇంతకు ముందెప్పుడూ లేవు. అయితే కేసీఆర్ కేబినెట్ లోని పలువురు మంత్రులపైన, పలువురు టీఅర్ఎస్ ఎమ్మెల్యేలపైన భూఅక్రమాల ఆరోపణలు చాలానే ఉన్నాయి. కేటీఆర్ ఫాంహౌస్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.
పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రాధామ్యాలు మారిపోయాయి. కొంతమంది కొత్త నేతలు తెరపైకి వచ్చారు. అలాంటి వాళ్ల మాటలు వినే తనలాంటి సీనియర్లను దూరం పెడ్తున్నారని ఈటల రాజేందర్ భావించారు. మంత్రిగా ఉన్న తనకే ప్రగతి భవన్ లోకి ఎంట్రీ దొరకలేదని చెప్పారంటే ఆయన ఎంతగా హర్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. పైగా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని.. అయినా తానెప్పుడూ చెప్పలేదన్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు లభించిందని, ఆయన వల్లే తాను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాననే చెప్పుకుంటున్నారు. ఎక్కడా కేసీఆర్ పైన కానీ, పార్టీ పైన కానీ విమర్శలు చేయట్లేదు. తానేంటో తెలిసి కూడా కేసీఆర్ ఇలా తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా.. అంటూ బంతిని కేసీఆర్ కోర్టులోకే నెట్టారు ఈటల.
అవి అసైన్డ్ భూములు కావని, దేవాలయ భూముల పరిధిలో లేవని ఈటల చెప్తున్నారు. అసలు అవి ఎవరి భూములో తేల్చాలంటూ ప్రభుత్వాన్ని తాను వై.ఎస్. ఉన్నప్పటి నుంచే కోరుతున్నట్టు చెప్పారు. ఇప్పటికీ వాటిని తేల్చలేదన్నారు. తన పరిధిలో ఆరున్నర ఎకరాల భూమి ఉందన్న ఆయన.. దేవరయాంజల్ లోని ఎంతోమంది రైతుల చేతుల్లో ఆ భూములున్నాయన్నారు. తనకోసం వాళ్లను బలిచేయొద్దంటున్న ఈటల.. ఆ భూమిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తాజాగా హైకోర్టు కూడా ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోకుండా కక్షపూరితంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందంటూ.. స్టే ఇచ్చింది. ఈ పరిణామాలన్నీ ఈటలకే అనుకూలంగా ఉన్నాయని పార్టీలోనే కొంతమంది నేతలు గుసగుసలాడుతున్నారు. ఈటల విషయంలో కేసీఆర్ తొందరపడ్డారేమోనని భావిస్తున్నారు. ఈటల లాంటి నేతకే ఈ పరిస్థితి ఎదురైతే రేపు తమకు కూడా ఇలాంటి పరిస్థితి రాదనే నమ్మకమేంటని కొంతమంది నేతలు మధన పడుతున్నారట. మరి ఈటల వ్యవహారం ఎంతదాకా వెళ్తుందో వేచి చూద్దాం..