కేసీఆర్ కేబినెట్ లో త్వరలో భారీ కుదుపులు..!

తెలంగాణ రాజకీయాల్లో ఒక రకమైన స్తబ్దత నెలకొంది. కేబినెట్ నుంచి ఈటలను భర్తరఫ్ చేయడం, ఆయన పలువురు నేతలతో వరుసగా భేటీ అవుతుండడం.. లాంటి పరిణామాలు భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ కలిగిస్తున్నాయి. దీన్ని పక్కన పెడితే.. కేబినెట్ నుంచి ఈటలను తప్పించిన తర్వాత ఆ స్థానం ఎవరికి దక్కుతుందనే లెక్కలేసుకుంటున్నారు గులాబీ నేతలు. ఈటల ప్లేస్ లో స్థానం కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. త్వరలోనే కేబినెట్ లో మార్పులు, చేర్పులు ఉంటాయనే ఊహాగానాల నేపథ్యంలో ఆశలకు హద్దులేకుండా పోయింది.
తెలంగాణ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై చర్చ కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలాసార్లు వినిపించింది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయబోతున్నారని.. ఆ సందర్భంగా కొంతమంది కొత్త ముఖాలకు స్థానం దక్కుతుందని ప్రచారం జోరుగా సాగింది. అయిత కరోనా.., కేసీఆర్ ఆరోగ్యం.. లాంటి అనేక అంశాలు ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణను ఎప్పటికప్పుడు వెనక్కు నెట్టేశాయి. అయితే ఇప్పుడు మరోసారి కేబినెట్ మార్పులు చేర్పులు చర్చ మొదలైంది. ఈటల స్థానం ఖాళీ కావడమే ఇందుకు కారణం.
ఈటలను తప్పించిన తర్వాత ఆయన నిర్వహించిన వైద్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆరే నిర్వహిస్తున్నారు. కరోనా బీభత్సంగా ఉన్న నేపథ్యంలో వైద్య శాఖను నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే దీనికి పూర్తిస్థాయి కేబినెట్ మంత్రి ఉంటే బాగుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. వైద్యశాఖను వేరే వాళ్లకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకోవడం ద్వారా కేసీఆర్ త్వరలో కేబినెట్ పునర్వ్యవవస్థీకరణ ఉంటుందనే సంకేతాలిచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేబినెట్ ను విస్తరించే ఉద్దేశం లేకుంటే వైద్యశాఖను మరో మంత్రికి కట్టబెట్టేవారని చెప్పుకుంటున్నారు.
ఈటల భర్తరఫ్ వ్యవహారం కేసీఆర్ కేబినెట్ సహచరులపైనా ప్రభావం చూపిస్తోంది. అసైన్డ్ భూములను ఆక్రమించారంటూ ఈటలను కేబినెట్ నుంచి తప్పించారు. అయితే ఇదే సమయంలో మరికొంతమంది కేబినెట్ సహచరులపైన కూడా భూఆక్రమణల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈటలపై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ ఆఘమేఘాలపై విచారణ జరిపించి వేటు వేశారు. మరి మిగిలిన వారిపై వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు అలాంటి చర్యలు తీసుకోలేదు.. వారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ద్వారా ఇలాంటి ఆరోపణలన్నింటికీ చెక్ చెప్పాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ఇదే సరైన సమయమని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించడం, మంత్రిపదవులను సమర్థంగా నిర్వహించిని మరికొందరిని తప్పించడం, తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న పలువురికి ఉద్వాసన పలకడం లాంటివన్నీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో చోటు చేసుకోబోతున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈటల ప్రకంపనల వ్యవహారం కేబినెట్ లో భారీ కుదుపుకు కారణమవుతుందని తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మంత్రులపై వేటు పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ల స్థానంలో వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వారికి స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో!