BRS : మూసీపై బీఆర్ఎస్ యూటర్న్..!?

రాజకీయ నాయకులు ప్లేట్ ఫిరాయించినంత ఈజీగా మరెవరూ మార్చలేరు. ఈ విషయంలో పొలిటీషియన్స్ (politicians) అంతా పీహెచ్డీ (Ph.D) చేసినట్లున్నారు. అందుకే అవసరానికి అనుగుణంగా వాళ్లు మాట్లాడుతుంటారు. లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక్కోసారి వాళ్ల నిర్ణయాలు వాళ్లకే ఎదురు తన్నుతుంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ (BRS) పరిస్థితి కూడా అంతే. మూసీ నదీ (Musi River) ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ (TRS) పెద్దఎత్తున ఉద్యమిస్తోంది. అయితే సరిగ్గా ఇదే అంశంపై బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టింది రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున ప్రవహిస్తుంది మూసీ నది. నిజాం (Nizam) కాలంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నదిపై ఎన్నో ప్రాజెక్టులు (Projects) కూడా ఉన్నాయి. అయితే క్రమంగా ఇది ఆక్రమణలకు గురైంది. నది కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే నది ఉనికికే ప్రమాదం అని భావించిన ప్రభుత్వాలు.. దీన్ని ప్రక్షాళించాలని ఎంతోకాలంగా ఆలోచిస్తున్నాయి. లండన్ (London) లో థేమ్స్ నది (Thames River) లాగా దీన్ని సుందరీకరిస్తే హైదరాబాద్ కు మరో మణిహారంగా మారుతుందని భావించాయి. అందుకోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించాయి. కానీ ఆచరణలోకి మాత్రం తీసుకురాలేకపోయాయి.
కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రక్షాళనను పూర్తి చేయాలని సకల అధికారాలు కట్టబెట్టారు. దీంతో ఇది దూకుడు మీదుంది. పరివాహక ప్రాంతంలోని వాళ్లందరినీ తరలించి వాళ్లు అక్రమించుకున్న ఇళ్లను కూలగొడుతోంది. దాదాపు 16వేల ఆక్రమణనలు ఉన్నట్టు అంచనా వేశారు. వాళ్లందరినీ డబుల్ బెడ్ రూం (Double bed room Houses) ఇళ్లలోకి తరలిస్తున్నారు. సామాను తీసుకెళ్లేందుకు కూడా అమౌంట్ ఇస్తున్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఈ విషయంలో తగ్గేదే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
అయితే.. బీఆర్ఎస్ మూసీ ప్రక్షాళనను ఆయుధంగా తీసుకుంది. బాధితుల పక్షాన అండగా నిలబడింది. ఉదయం లేచింది మొదలు కూల్చివేతల (demolition) దగ్గరకు వెళ్లి ఆందోళనలకు దిగుతోంది. అయితే సరిగ్గా ఇక్కడే బీఆర్ఎస్ ను ఇరుకున పడేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మూసీ ప్రక్షాళనకు (Musi River Development) కార్యాచరణ రూపొందించింది. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టారు. వాళ్లు చేస్తే కరెక్ట్.. మేము చేస్తే తప్పా అని ఎదురుదాడికి దిగారు రేవంత్ రెడ్డి. దీంతో నాలుక కరుచుకున్న బీఆర్ఎస్ నేతలు.. తాము 17వేల కోట్లతో మూసి ప్రక్షాళన చేయాలనుకున్నామని.. రేవంత్ సర్కార్ మాత్రం లక్ష కోట్లతో చేస్తోందని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే మూసీ ప్రక్షాళన వల్ల చాలా మంది పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు దొరుకుతున్నాయి. ఆ కంపు నుంచి బయటపడితే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. మూసీ ప్రక్షాళన వల్ల తమకు సౌకర్యవంతమైన ఇల్లు దొరుకుతుందని ఆనందిస్తున్నారు. కొంతమంది మాత్రమే మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. అయితే కొంతమంది కోసం ఉద్యమించి ఎక్కువమందిని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదేమోనని బీఆర్ఎస్ ఇప్పుడు డైలమాలో పడింది. అందుకే మూసీ ప్రక్షాళనపై దూకుడు తగ్గించాలని శ్రేణులకు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం.