హైదరాబాద్ లో 830 కోట్లతో బ్రిస్టల్ ఇన్నోవేషన్ హబ్

ప్రపంచంలోని అతిపెద్ద బయోఫార్మా స్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ హైదరాబాద్‌లో తమ నూతన ఐటీ, డ్రగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. దాదాపు రూ.830 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో ఈ ఇన్నోవేషన్ హబ్‌ను నెలకొల్పింది. ఇందులో కొత్తగా 1,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కంపెనీ సీఈవో క్రిస్టోఫర్ బార్నర్, సీటీవో గ్రెగ్ మేయర్స్ కలిసి ఈ కేంద్రాన్ని ఆవిష్కరించినట్టు బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ తెలియజేసింది. ఇక్కడ ఔషధాల అభివృద్ధితో పాటు ఐటీ, డిజిటల్ సామర్థ్యాలను విస్తరించనున్నట్టు వివరించింది. హైదరాబాద్‌లో బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దీన్ని రాష్ట్ర ఔషధ, డిజిటల్ రంగాల్లో ఓ మైలురాయిగా అభివర్ణించిన ఆయన ఇందుకుగాను కంపెనీకి దన్యవాదాలు తెలిపారు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ రంగాల్లో స్థానిక ప్రతిభావంతులకు పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. తెలంగాణలో ఐటీ, డిజిటల్ రంగాల్లో ప్రతిభావంతులకు కొదవే లేదని తెలిపారు. రాష్ట్రంలో ఈ రంగాల అభివృద్ధికి బ్రిస్టల్ మైయర్స్ సహకారం అందించాలని కోరారు.