BJP: హిల్ట్ పాలసీని తక్షణమే నిలిపివేయాలి .. గవర్నర్ కు బీజేపీ నేతల వినతి
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హిల్ట్(హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్)పాలసీని తక్షణం నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ను బీజేపీ (BJP) కోరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు (Ramchandra Rao) నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందంరాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవో 27ను సస్పెండ్ చేసేలా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమగ్ర విచారణకు ఆదేశించాలని అభ్యర్థించింది. రూ.కోట్ల విలువైన పారిశ్రామిక భూములను కొంత మంది అధికార పార్టీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అతి తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అనంతరం రాంచందర్రావు మీడియాతో మాట్లాడారు. హిల్ట్ పాలసీ (Hilt Policy)ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. రైతులు, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకువచ్చింది. రూ.వేల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను సబ్ రిజిస్ట్రార్ ధరలో మూడో వంతు ధరకే రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ధరలో 30 శాతం తక్కువకు ఈ పరిశ్రమల భూములను రియల్టర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని గవర్నర్కు వివరించాం. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. హిల్ట్ పాలసీతో పాటు జీహెచ్ఎంసీ (GHMC) పరిధి విస్తరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 7న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తాం అని పేర్కొన్నారు.






