ప్రధాని పదవికే కళంకం తెచ్చారు మోదీ: భట్టి విక్రమార్క

బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయని, అవినీతి, అస్థిరతతో ప్రజలు విసిగిపోయారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని ఫరీద్ కోట్ లోక్‌సభ పరిధిలోని కోటక్ పుర అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమికి వస్తున్న ఆదరణ చూసి మోదీ ఆందోళన చెందుతున్నారని, అందుకే విపక్షాలపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. దీని వల్ల యువతకు తీరని నష్టం వాటిల్లుతోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయి. అవినీతి, అస్థిరతతో ప్రజలు విసిగిపోయారు. ఎన్నికల వేళ గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవాల్సిన ప్రధాని మోదీ.. మతం, మంగళసూత్రం, ముజ్రా వంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇలాంటి వ్యాఖ్యలతో మోదీ.. ప్రధాని స్థాయికే కళంకం తెచ్చారు. అందుకే ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు పెద్ద మార్పు తీసుకురాబోతున్నారు’’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ప్రభుత్వం రాగానే.. అగ్నివీర్‌ను రద్ధు చేస్తామని, రైతులందరికీ రుణమాఫీ చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.