మంత్రి దామోదర్ రాజనర్సింహతో ఆస్ట్రేలియా బృందం భేటీ

తెలంగాణ రాష్ట్రంలో పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం గవర్నర్‌మెంట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంత్రితో గవర్నమెంట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా, ఆరోగ్య శాఖ మంత్రి అంబర్ జేడ్ శాండర్సన్, అధికారుల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో మెడికల్, పారామెడికల్ హెల్త్‌కేర్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తి చేసినవారికి శిక్షణ ఇస్తున్నామని, వారు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్యవిద్య అందిస్తున్నామన్నారు. ఏటా 8,515 మంది మెడికల్, 6,880 మంది నర్సింగ్, 22,970 మంది పారామెడికల్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేస్తున్నారని తెలిపారు. వైద్య పర్యాటకానికి గమ్యస్థానంగా హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు.