తెలంగాణ రాష్ట్రంలో మరో సంస్థ భారీ పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రంలో మరో సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తన ప్లాంటును రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకోసం రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంలో అవగాహన ఒప్పందం చేసుకొన్నారు. రాష్ట్రంలోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో రెండు దశల్లో ఈ సంస్థ పెట్టుబడి పెడుతుంది. తొలుత రోజుకు 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంటును ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దీన్ని రోజుకు పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యానికి విస్తరిస్తారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు దక్షిణ భారతదేశంలో మొదటిదని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. పాలతో పాటు బటర్ మిల్క్, పెరుగు, లస్సీ, పన్నీర్, స్వీట్లు తదితరాలను ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తామన్నారు. దీంతో పాటు బేకరీ ప్రొడక్షన్ డివిజన్ను కూడా ఏర్పాటు చేసి బ్రెడ్, బిస్కెట్, ఇతర బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తామన్నారు.
ఈ ప్లాంటు ద్వారా 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్లాంటుకు అవసరమైన పాలను తెలంగాణ రైతుల నుంచే సేకరిస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో అమూల్ కంపెనీ తరపున గుజరాత్లోని సాబర్కాంఠా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కో ఆపరేటివ్ సొసైటీ యూనియన్ ఎండీ బాబూభాయ్ ఎం పటేల్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.






