జపాన్ పర్యటనకు తెలంగాణ విద్యార్థిని

జాతీయస్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఎం పూజశ్రీ జపాన్‌లో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. అల్ఫోర్స్ ముఖ్య కార్యాలయంలో విద్యార్థినిని విద్యాసంస్థల అధినేత వీ నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన పూజశ్రీ సుల్తానాబాద్ అల్ఫోర్స్ పాఠశాలలో ఇటీవలే పదోతరగతి పూర్తి చేసిందని పేర్కొన్నారు. గతంలో జాతీయస్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్స్‌లో వీల్ ఆక్సిల్ కెమెరాపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందని తెలిపారు. దీంతో ఈ నెల 19 నుంచి 25 వరకు జపాన్‌లోని సకురాలో జరిగే అంతర్జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్స్ వేడుకల్లో పాల్గొనన్నదని వివరించారు. పూజశ్రీ అంతర్జాతీయ స్థాయి లోనూ అద్భుత ప్రదర్శన చేసి దేశానికి, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు.