Jagan: డిలే అవుతున్న జగన్ వ్యూహాలు..సొంత పార్టీ నుంచే విమర్శలు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో యూరియా సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల వైసీపీ (YCP) అధినేత జగన్ (Jagan) ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల వద్ద ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయితే ఈ నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నదా..లేదా.. అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత పెద్దగా కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒత్తిడి చేయడంతో రాష్ట్రానికి అవసరమైన ఎరువులు అందుబాటులోకి వచ్చాయి.
కొద్ది రోజుల క్రితమే రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆధార్ కార్డు చూపించి ఒక్క బస్తా మాత్రమే యూరియా ఇచ్చే పరిస్థితి నెలకొంది. వర్షాలు ఆలస్యంగా రావడం, దానితోపాటు ఎరువు అందుబాటులో లేకపోవడం వల్ల పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందుకు వచ్చి రైతుల కోసం పోరాడితే పార్టీకి రాజకీయంగా లాభం కలిగేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. కానీ సమస్య తగ్గిన తర్వాత ధర్నాకు పిలుపు ఇవ్వడం వల్ల రైతులు పెద్దగా స్పందించే అవకాశం లేదని భావిస్తున్నారు.
రైతులు నేరుగా ప్రభావితమైన సమయంలోనే ఆందోళన చేస్తే పార్టీకి ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చేది. ఇప్పుడు మాత్రం ధర్నాలకు హాజరయ్యేది పార్టీ కార్యకర్తలే తప్ప, రైతులు పెద్ద సంఖ్యలో రారని అంచనా వేస్తున్నారు. రాజకీయంగా సమయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల వైసీపీ పదే పదే అవకాశాలను కోల్పోతుందని కేడర్ లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ముందు కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. బంగారుపాళ్యం (Bangarupalem)లో మామిడి రైతుల కోసం ధర్నా చేసినప్పుడు రోడ్లపై మామిడి కాయలు వేసి ట్రాక్టర్ తో తొక్కించడం పార్టీకి బూమరాంగ్ అయింది. అలాగే పొదిలి (Podili)లో పొగాకు రైతుల కోసం చేసిన ఆందోళనలో బస్తాలను తొక్కి నాశనం చేయడం ప్రత్యర్థులకు మంచి ఆయుధంగా మారింది. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీకి అనుకూలంగా కాకుండా ప్రతికూల ప్రచారం వచ్చింది.
ఇప్పుడు యూరియా సమస్య విషయంలో కూడా అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉండగా ధర్నాలు చేయడం వల్ల రైతులకు ఉపయోగం ఏమీ ఉండదని, బదులుగా అధికార పార్టీ తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమస్య ఉన్న సమయంలోనే పోరాటం చేస్తే అది నిజమైన ప్రజా సమస్యలపై అంకితభావంగా ప్రజలు భావిస్తారు. సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆందోళనలు నిర్వహించడం వల్ల రాజకీయ ప్రయోజనం మాత్రమే కనిపిస్తుందని, ప్రజల నుంచి అనుకూలత లభించదని చాలామంది సూచిస్తున్నారు. వైసీపీ తరచూ ఇలాంటి వ్యూహపరమైన తప్పిదాలతో రాజకీయంగా వెనుకబడుతోందని కేడర్ కూడా చెబుతోంది. ఇప్పుడు జగన్ ఇచ్చిన పిలుపు ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.