CBN: ప్రతి మహిళకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్..ప్రజారోగ్యంపై చంద్రబాబు నూతన దిశా నిర్ధేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్ (Cancer) కేసులు ప్రజల జీవితాలను ముప్పుకు గురి చేస్తున్నాయని గుర్తించిన ఆయన, ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. వ్యాధి ముదిరిన తర్వాత గుర్తించడం వల్ల చికిత్స కష్టమవుతోందని భావించిన సీఎం, ఆ పరిస్థితిని మార్చేందుకు ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం కింద ప్రతి మహిళకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటింటికీ వెళ్లి మహిళలకు వైద్య పరీక్షలు చేయడం ఈ కార్యక్రమంలో ముఖ్య భాగం. ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ (G. Veerapandian), ప్రభుత్వ వైద్య బృందాలు ప్రతి గ్రామానికి చేరుకుని ఈ పరీక్షలను చేపడతాయి అని అన్నారు. ‘మహిళల కోసం ప్రత్యేక క్యాన్సర్ పరీక్ష’ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వాన పత్రాలను సిద్ధం చేసింది. వీటిని ఎఎన్ఎంలు (ANMs) కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (CHOs) ప్రతి ఇంటికీ తీసుకెళ్తారు.
విజయవాడ (Vijayawada) నగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సీఎం క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. 4వ విడత ఎన్సీడీ (Non-Communicable Diseases) స్క్రీనింగ్ కార్యక్రమంలో ప్రధానంగా క్యాన్సర్ పరీక్షలపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించింది. పోస్టర్లు, పాంప్లెట్లు, ఐఇసీ (Information, Education and Communication) కార్యకలాపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత రక్తపోటు, మధుమేహం, ఎనీమియా పరీక్షలు కూడా నిర్వహిస్తారు. మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయనున్నారు. ఈ పరీక్షల ఫలితాలను స్థానిక వైద్యాధికారులకు అందజేస్తారు. అవసరమైతే వారిని సమీప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులకు (GGH) పంపించి ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లలో చికిత్స అందిస్తారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20,000 మందికి పైగా వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గత స్క్రీనింగ్ కార్యక్రమాల్లో సుమారు 2 లక్షల అనుమానిత కేసులు బయటపడగా, వారిలో 4,500 మందిని స్పెషలిస్టు వైద్యుల వద్దకు పంపించారు. వీరిలో 783 మందికి క్యాన్సర్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.
సీఎం చంద్రబాబు ప్రజలకు “క్యాన్సర్‌ను భయపడాల్సిన అవసరం లేదు, ముందస్తు పరీక్షల ద్వారా దీన్ని అధిగమించవచ్చు” అని పిలుపునిచ్చారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధిని ఎదుర్కోవచ్చని సూచించారు. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ విషయంలో మహిళలు నిర్లక్ష్యం చేయకూడదని కమిషనర్ వీరపాండియన్ అన్నారు. ఎఎన్ఎంలు, సిహెచ్ఓలు అందించే ఆహ్వాన పత్రం ద్వారా సమీప ఆరోగ్య కేంద్రాలకు వచ్చి స్క్రీనింగ్ చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రజల ప్రాణ రక్షణకు దారితీసే గొప్ప అడుగుగా భావిస్తోంది.







