YCP: వర్షాకాల సమావేశాల ముందు వైసీపీ ఎమ్మెల్యేల దిక్కుతోచని స్థితి..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దాదాపుగా ఆ తేదీకే ఖరారు చేస్తారని అంటున్నారు. ఈసారి సమావేశాలు పదిరోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యమైన బిల్లులు, ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోదం పొందడమే ముఖ్య ఉద్దేశ్యం. ప్రభుత్వం డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు జరిపే ఆలోచనలో ఉంది. అది సాధ్యం కాకపోతే మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల వరకూ వేచి చూడవచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా రాబోయే వర్షాకాల సమావేశాలు కీలకమైనవే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన వైసీపీ (YCP) ఎమ్మెల్యే లను ఉద్దేశిస్తూ, మీడియా ముందు కాకుండా అసెంబ్లీలోనే అన్ని విషయాలు చర్చిద్దామని సవాలు విసిరారు. ప్రతిపక్షం హోదా విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ తన డిమాండ్‌పై వెనక్కి తగ్గడం లేదు. అసెంబ్లీలో తామే ఏకైక ప్రతిపక్షమని, అందువల్ల హోదా రావాలని వాదిస్తోంది. అయితే స్పీకర్ మాత్రం నిబంధనలను ప్రస్తావిస్తూ, కనీసం 18 మంది సభ్యులు ఉన్నప్పుడే ఆ హోదా వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వద్ద 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఆ అర్హత లేదని స్పీకర్, ముఖ్యమంత్రి ఇద్దరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కొందరికి గైర్హాజరుపై భయం మొదలైంది. వరుసగా అరవై రోజుల పాటు సభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం ఉందని నిబంధన చెబుతోంది. దీంతో కొత్తగా గెలిచిన ఐదారుగురు ఎమ్మెల్యేలు మధన పడుతున్నారని చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), ద్వారకానాధ్ రెడ్డి (Dwarakanath Reddy), అమర్నాథ్ రెడ్డి (Amarnath Reddy), బాల నాగిరెడ్డి (Bala Nagi Reddy) వంటి సీనియర్ నాయకుల మినహా మిగిలిన వారంతా కొత్తవారే కావడం గమనార్హం.
ఇప్పటికే ఒకసారి బడ్జెట్ సమావేశాల సమయంలో సభ్యత్వం కోల్పోకుండా ఉండటానికి కొందరు సభ్యులు సభకు రాకుండానే రిజిస్టర్‌లో సంతకాలు పెట్టారని ప్రచారం జరిగింది. కానీ స్పీకర్ అప్పట్లోనే అలాంటి పద్ధతి అంగీకరించబోమని రూలింగ్ ఇచ్చారు. ఈసారి మాత్రం నిజంగా సభకు హాజరు కావాల్సిందే అన్న పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ వద్ద ఉన్న మొత్తం 11 మందిలో సగం మంది అయినా అసెంబ్లీకి హాజరవాలని నిర్ణయించుకుంటే పార్టీ అధినాయకత్వానికి ఇది పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అధినేత నిర్ణయాన్ని ధిక్కరిస్తే పార్టీ పరంగా సమస్యలు ఎదురవుతాయి. అయితే తమ సభ్యత్వాలను కాపాడుకోవడానికి కొందరు సభ్యులు తప్పనిసరిగా సభకు రావాలని భావిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రచారంలో ఎంత నిజముందో రాబోయే సమావేశాలతో తేలిపోతుంది.