YS Sunitha: వైఎస్ వివేకా హత్య కేసు.. మరిన్ని సంచలన విషయాలు చెప్పిన సునీత..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) సంచలనం రేపింది వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka) హత్య. ఈ కేసు ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ దోషులెవరూ తేలలేదు. వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితులు బెయిల్‌పై బయట తిరుగుతుండగా, వివేకా కుమార్తె డాక్టర్ సునీత నర్రెడ్డి (YS Sunitha) న్యాయం కోసం కడప (Kadapa) నుంచి ఢిల్లీ వరకూ ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. తాజాగా జిల్లా ఎస్పీతో జరిగిన సమావేశం, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో (BJP MLA Adinarayana Reddy) భేటీ ఈ కేసుకు మళ్లీ చర్చనీయాంశంగా మార్చాయి.
వైఎస్ వివేకానంద రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు. 2019 ఎన్నికల సమయంలో పులివెందులలో హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుగా ప్రచారం చేశారు బంధువులు. ఆటోప్సీ నివేదికలో ఏడు కత్తిపోట్లు కనిపించడంతో హత్యగా నిర్ధారణ అయింది. కేసు మొదట రాష్ట్ర పోలీసుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)కి అప్పగించారు. తర్వాత పురోగతి లేకపోవడంతో 2020లో సీబీఐకి బదిలీ అయింది. సీబీఐ 2021 అక్టోబరులో మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేసి.. యర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, యడతి సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంది. దస్తగిరి తర్వాత అప్రూవర్‌గా మారి, కేసులో కొత్త విషయాలను వెల్లడించాడు. 2023 జూన్‌లో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను కూడా నిందితులుగా చేర్చారు.
సీబీఐ విచారణలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిల పాత్రపై ఆరోపణలు వచ్చాయి. అవినాశ్ రెడ్డి 2023 మేలో తెలంగాణ హైకోర్టు నుంచి షరతులతో కూడిన అంటిసిపేటరీ బెయిల్ పొందారు. సునీత ఈ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవినాశ్ రెడ్డి క్రైం సీన్‌ను తారుమారు చేయడం, సాక్ష్యాలను నాశనం చేయడం, సాక్షులను బెదిరించడంలో అవినాశ్ రెడ్డి పాల్గొన్నారని ఆమె వెల్లడించారు. తాజాగా, సునీత మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి తన వద్దకు ఒక లేఖ తీసుకొచ్చి, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బిటెక్ రవిలు ఈ హత్య చేశారని సంతకం చేయాలనిని కోరారని, కానీ ఆ లేఖ చదివిన తర్వాత తాను సంతకం చేయలేదని వెల్లడించారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
గురువారం వైఎస్ సునీత తన భర్తతో కలిసి కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిశారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆమె తన బంధువు సురేష్‌పై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, అవినాశ్ రెడ్డి అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. ఆమె ఈ కేసులో న్యాయం కోసం ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నానని, నిందితులకు ఇంకా శిక్ష పడలేదని విచారం వ్యక్తం చేశారు. సాక్షుల రక్షణ, విచారణను వేగవంతం చేయాలని ఎస్పీని కోరినట్లు తెలుస్తోంది.
ఇవాళ బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పులివెందులలో సునీత కుటుంబసభ్యులను కలిశారు. ఈ భేటీ కేసుకు సంబంధించిన రాజకీయ, వ్యక్తిగత కోణాలను మరింత ఆసక్తికరంగా మార్చింది. ముఖ్యంగా సునీత గతంలో ఆదినారాయణ రెడ్డిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో ఏం చర్చించారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ ఇది కేసు విచారణపై కొత్త ఒత్తిడిని తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి హయాంలో విచారణలో పురోగతి లేకపోవడంపై సునీత తీవ్ర విమర్శలు చేశారు. అవినాశ్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని, సీబీఐ విచారణను అడ్డుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీబీఐ విచారణలో గణనీయమైన పురోగతి కనిపించకపోవడంతో సునీత నిరాశ వ్యక్తం చేశారు. ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనితలను కలిసి కేసు విషయంలో చర్చించినప్పటికీ, ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి.