పనులు ఆగొద్దు.. ఉపాధి లభిస్తుంది : సీఎం జగన్

రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతున్నా, అభివృద్ధి పనులేవీ ఆగకూడదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ యథావిథిగా పనులు జరిగేలా చూడాలన్నారు. ‘నవ రత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ అంశంపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జూన్ 1 నుంచి జగనన్న కాలనీల్లో పనులు ప్రారంభించాలని, ఇళ్ల నిర్మాణంలో ఎక్కడా జాప్యం చేయకూడదని సూచించారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంది, కార్మికులకు పని కూడా దొరుకుతుందని వివరించారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, స్టీల్ కొనడం ద్వారా వ్యాపార లావాదేవీలు కూడా జరుగుతాయని పేర్కొన్నారు.
ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్ లాంటివి అవసరం కాబట్టి, ఆ వ్యవస్థలను అప్రమత్తం చేయాలని కోరారు. అయితే కోవిడ్ నేపథ్యంలో స్టీల్ వినియోగం తగ్గుతుందని, దీంతో రేట్లలో కాస్త తేడా వచ్చే వీలుందని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి 7.50 లక్షల టన్నుల స్టీల్ కావాలని, అందుకే స్టీల్ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇంత పెద్ద స్థాయిలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది కాబట్టి అదనపు నిధుల విషయంలో కేంద్రాన్ని అడుగుదామని, టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు.