Jagan: బిగుసుకుంటున్న లిక్కర్ స్కాం ఉచ్చు .. గవర్నర్ తో జగన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం (AP Liquor Scam) దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, మాజీ ప్రభుత్వ కాలంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారులు అరెస్టుకు గురవుతున్నారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir)తో భేటీ కావాలని నిర్ణయించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజా పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పేరు మద్యం స్కాంలో ప్రస్తావించబడటంతో ఆయన అరెస్టుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఒకవేళ మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరం. ఇదే సమయంలో సిట్ (CIT) అధికారులు ఈ కేసుకు సంబంధించి మొదటి చార్జిషీటు కోర్టుకు సమర్పించగా, మరో అనుబంధ చార్జిషీటుకు మూడు వారాల గడువు కోరారు. ఈ గడువు త్వరలో ముగియనున్న నేపథ్యంలో జగన్ గవర్నర్‌ను కలవాలని నిర్ణయించటం కీలకంగా మారింది. గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించడంతో ప్రస్తుతం బెంగళూరు (Bengaluru)లో ఉన్న జగన్ తాడేపల్లికి (Tadepalli) చేరుకున్నట్లు సమాచారం.
వైసీపీ (YCP) వర్గాల ప్రకారం, ప్రభుత్వంపై చేస్తున్న అక్రమ కేసుల నమోదు, జిల్లా పర్యటనలపై ఆంక్షలు తదితర అంశాలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్ ఈ భేటీ కోరినట్టు చెబుతున్నారు. తమ నాయకులను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం దుష్ప్రచారంతో ముందుకెళ్తోందని ఆవేదన గవర్నర్‌కు తెలియజేయాలనేది వైసీపీ ఉద్దేశం. ఇవాళ సాయంత్రం గవర్నర్‌తో సమావేశం కాగా, రేపు పార్టీ కార్యాలయంలో పీఏసీ (PAC) సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.
రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ వైసీపీ అధినేత తన నేతలకు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు. ఇప్పటికే అరెస్టైన నేతలను చట్టపరంగా ఎలా కాపాడుకోవాలో, ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని ఎలా పెంపొందించాలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజంపేట (Rajampet) ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy), కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) వంటి నేతల పరామర్శ కోసం జగన్ రాజమండ్రి (Rajahmundry), నెల్లూరు (Nellore)కు పర్యటనల ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెబుతున్నారు.
ఈ నెల 31న నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద కాకాణిని కలవాలని భావిస్తుండగా, ఆగస్టు 5న రాజమండ్రిలో మిథున్ రెడ్డి పరామర్శకు వెళ్ళనున్నారు. ఇదే పర్యటనలో టీడీపీ కార్యకర్తల దాడిలో నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapureddy Prasanna Kumar Reddy)ను కలవనున్నారు. తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.