ABV: ఎ.బి.వెంకటేశ్వర రావు ఆగ్రహానికి కారణమేంటి..?

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు (ABV) ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ (TDP) అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu) సన్నిహితుడిగా పేరొందారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా, బనకచర్ల (Banakacherla) ప్రాజెక్టుపై ఆయన తీసుకున్న వైఖరి టీడీపీ (TDP) అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ వివాదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఏబీ వెంకటేశ్వర రావు (A B Venkateswara Rao) కూడా ఘాటుగా స్పందించారు. దీంతో ఇదిప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
గోదావరి నది నీటిని కృష్ణా, పెన్నా నదుల రాయలసీమకు అందించాలనే ఉద్దేశంతో బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కేవలం వరద నీటిని మాత్రమే ఉపయోగిస్తుందని, తెలంగాణకు ఎటువంటి నష్టం జరగదని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర హక్కులైన నీటి వాటాను దెబ్బతీస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి (BRS) నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే.. ఏబీ వెంకటేశ్వర రావు కూడా అలోచనపరుల వేదిక (Think Tank Forum) తో కలిసి బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర రైతులకు ప్రయోజనం చేకూర్చకుండా, కాంట్రాక్టర్ల లబ్దికోసం రూపొందించబడిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసీఆర్ (KCR) లతో కలిసి మేఘా కృష్ణారెడ్డి (Megha Krishna Reddy) ఈ పథకాన్ని ప్రతిపాదించారని ఆయన ఆరోపించారు. ఈ విమర్శలు చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.
ఏబీ వెంకటేశ్వర రావు విమర్శలు టీడీపీ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సోషల్ మీడియాలో కొందరు ఆయనపై వ్యక్తిగత దాడులు చేస్తూ, ఆయన ఏదో స్వప్రయోజనం కోసం ఈ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది ఏబీవీపై ప్రత్యేకంగా వీడియోలు చేశారు. ఏబీవీని ఎవరో తెరవెనుక నడిపిస్తున్నారని విమర్శించారు. ఈ ఆరోపణలకు ఏబీవీ ఘాటుగా స్పందించారు. తాను ఏదో ఆశించి ఈ విమర్శలు చేస్తున్నానని ఆరోపించే వారు దానికి సంబంధించిన ఆధారాలను బహిరంగంగా చూపాలని సవాల్ విసిరారు. అలాంటి ఆరోపణలు చేసే సుపారీగాళ్లకు కూడా ఈ విషయం తెలియజేయండి అని ఆయన రాశారు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఒంటరిగా పోరాడినప్పుడు ఎవరూ తనకు సహాయం చేయలేదని, ఇప్పుడు “మంచి ప్రభుత్వం”లో కూడా తనపై పెట్టిన కేసులు ఎత్తేయడానికి 9 నెలలు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. “జగన్ నెవర్ ఎగైన్” అనే నినాదంతో రాష్ట్రాన్ని జగన్ నుంచి కాపాడుకునేందుకు పనిచేస్తున్నానని, తనకు మణులు, మాన్యాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఏబీ వెంకటేశ్వర రావు సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారడంతో, ఆయన వైఖరిపై చర్చలు మరింత తీవ్రమయ్యాయి. ఆయన గతంలో చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అందుకే ఆయన్ను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఐదేళ్లపాటు ఆయన్ను విధులకు దూరంగా ఉంచింది. దీంతో ఏబీవీకి చంద్రబాబు ప్రభుత్వంలో మంచి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు చంద్రబాబు. కానీ దాన్ని ఏబీవీ తిరస్కరించారు. టీడీపీ విషయాన్ని పక్కనపెడితే జగన్ ను టార్గెట్ గా చేసుకుని ఆయన పోరాడుతున్నారు. కానీ కొన్ని విధానపరమైన అంశాలను ఏబీవీ వ్యతిరేకించినప్పుడు టీడీపీ వాళ్లు కూడా ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ సహిస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు కౌంటర్ ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. మరి మున్ముంది ఏబీవీ, టీడీపీ మధ్య ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనేది వేచి చూడాలి.