TTD: తిరుమలలో భక్తుల రికార్డు.. తిరుమలలో సరికొత్త చరిత్ర..!
ఏడుకొండల వాడి చెంత భక్తుల రద్దీ సరికొత్త రికార్డులను సృష్టించింది. 2025-26 వార్షిక సంవత్సరానికి గాను శ్రీవారిని(Tirumala) దర్శించుకున్న భక్తుల సంఖ్య గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకుంది. గత రికార్డులన్నింటినీ చెరిపివేస్తూ స్వామివారి దర్శన భాగ్యం పొందిన భక్తుల గణాంకాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 2.67 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
గతంలో 2023-24 సంవత్సరంలో నమోదైన 2.56 కోట్ల దర్శనాలే(TTD Darshan) ఇప్పటివరకు అత్యధికం కాగా, ఈసారి ఆ రికార్డు కనుమరుగైంది. గత రికార్డుతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 11 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం విశేషం. ఈ అద్భుతమైన మార్పుకు ప్రధాన కారణం టీటీడీ ప్రవేశపెట్టిన సరికొత్త ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మానిటరింగ్ సిస్టమ్’గా పరిశీలకులు చెప్తున్నారు. ఈ అధునాతన సాంకేతికత ద్వారా భక్తుల రాకను, క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షించడం వల్ల దర్శన ప్రక్రియలో వేగం పెరిగింది.
ఎక్కడా అంతరాయం లేకుండా భక్తులను పంపడం సాధ్యమైంది. ముఖ్యంగా క్యూ లైన్ మానిటరింగ్ వ్యవస్థ పనితీరు వల్ల ప్రతిరోజూ అదనంగా 3 నుంచి 4 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగలిగారు. సమర్థవంతమైన నిర్వహణ వల్ల సామాన్య భక్తులకు తక్కువ సమయంలోనే దర్శన భాగ్యం కలుగుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుని టీటీడీ చేస్తున్న ఈ ప్రయత్నాలు భక్తుల పాలిట వరంగా మారాయి. టెక్నాలజీ వల్ల దర్శన స్లాట్ల కేటాయింపులో పారదర్శకత పెరిగిందని, దీనివల్ల సామాన్య భక్తులకు ప్రాధాన్యత దక్కుతోందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో పాటు, 2025-26 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం కూడా గత రికార్డులను అధిగమించే అవకాశం కనిపిస్తోంది. దర్శనాల సంఖ్యకు అనుగుణంగా అన్నప్రసాద వితరణ మరియు లడ్డు కౌంటర్ల(TTD Laddu) వద్ద కూడా అత్యాధునిక యంత్రాలను వాడటం వల్ల ఎక్కడా తోపులాటలు లేకుండా నిర్వహణ సాగుతోంది.






