NSS Awards:తెలుగు వారికి ఎన్‌ఎస్‌ఎస్ అవార్డులు

తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా ఎన్‌ఎస్‌ఎస్ అవార్డుల (NSS Awards) ను అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 2022-23కు మై భారత్–నేషనల్ సర్వీస్ స్కీం(ఎన్‌ఎస్‌ఎస్) అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వలంటీర్లు సమాజ సేవలో చేసిన అత్యుత్తమ సహకారాన్ని గుర్తించి వారికి కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఏటా ఎన్‌ఎస్‌ఎస్ అవార్డులను ప్రదానం చేస్తుంది. వలంటీర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో గల విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ముమ్ముల పృథ్వీరాజ్ (Prithviraj) , నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన డి. రెడ్డి జిష్ణు (D. Reddy Jishnu), తెలంగాణలోని సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన వంగపల్లి మణి సాయివర్మ (Mani Sai Varma) కు రాష్ట్రపతి ఎన్‌ఎస్‌ఎస్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద గ్రహీతలకు రూ.లక్షతో పాటు వెండిపతకం, సర్టిఫికెట్ లభిస్తాయి.