విజయవాడ కనకదుర్గమ్మకు.. తెలంగాణ బంగారు బోనం

ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. 15 ఏళ్లుగా ఈ కమిటీ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తోంది. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో రావిచెట్టు వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య, దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు దంపతులు, కమిటీ ప్రతినిధులు పూజ నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పోతురాజు విన్యాసాలు, కళాకారుల నృత్య ప్రదర్శనల నడుమ బంగారు బోనంతో ఊరేగింపు ప్రారంభమైంది. దుర్గాఘాట్‌లో పవిత్ర కృష్ణవేణికి గంగ తెప్పను సమర్పించి ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయానికి ఊరేగింపు చేరుకోగా, అక్కడ ఉత్సవ కమిటీ ప్రతినిధులకు ఈవో స్వాగతం పలికారు. కమిటీ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని బంగారు బోనం, పట్టు చీర, పూలు, పండ్లు సమర్పించారు.