Hyd: హైదరాబాద్ లో అమెరికా తెలుగు సంఘాల ముచ్చట
విందు సమావేశానికి హాజరైన తానా, ఆటా, టిటిఎ నాయకులు
అమెరికాలో అతి పెద్ద జాతీయ తెలుగు సంఘాలనాయకులంతా ఒక్కచోట చేరి మాట్లాడుకునేందుకు హైదరాబాద్ లో ఒక అవకాశం వచ్చింది. ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA), అమెరికా తెలుగు సంఘం (ATA), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అమెరికాలో ఏ సంఘమైనా నిర్వహించే మహాసభలకు, జాతీయ కార్యక్రమాలకు అన్నీ సంఘాల నాయకులు హాజరవడం పరిపాటి అయినా, హైదరాబాద్ లో మాత్రం మొదటిసారిగా తామంతా కలిసి ఒకచోట మాట్లాడటం ఇదే మొదటిసారని వారు చెప్పారు. హైదరాబాద్ లో ఇంతమంది నాయకులు ఉన్నారన్న విషయం తెలిసి అక్కడకు వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు.
ఫిలడెల్ఫియాకు నుంచి వచ్చిన జగదీశ్ రెడ్డి అనుమల, రవి పొట్లూరి హైదరాబాద్ లో ఒక డిన్నర్ సమావేశం ఏర్పాటు చేసి ఇతర సంఘాల నాయకులను ఆహ్వానించారు. అలాగే హైదరాబాద్ లో ఉన్న ఇతర ఎన్నారైలను కూడా ఆహ్వానించారు. ఈ వేడుకకు తానా నుంచి రవి పొట్లూరితోపాటు జయ్ తాళ్ళూరి, ప్రకాశ్ బత్తినేని, రఘు మేక వచ్చారు. ఆటా నుంచి అధ్యక్షుడు జయంత్ చల్లా, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, తిరుమల రెడ్డి, వేణుకొణతిరెడ్డి హాజరయ్యారు. టిటిఎ నుంచి ఆ సంఘం అధ్యక్షుడు నవీన్ మలిపెద్ది, విశ్వకంది, ఎల్.ఎన్. దొంతిరెడ్డి, చంద్రారెడ్డి పోలీస్ వచ్చారు. వీరితోపాటు చిత్ర నిర్మాత టి.జి. విశ్వప్రసాద్, బిగ్ టీవీ చైర్మన్ విజయ్ వెన్నం, తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బా రావు చెన్నూరి, ఇతర ఎన్ ఆర్ ఐ లు రాహుల్ కుందవరం, బాలాజీ వీర్నాల, రవితేజ ముత్తు, ముప్పా రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రవి పొట్లూరి మాట్లాడుతూ, అమెరికాలో ఉన్న మనమంతా ఇప్పుడు హైదరాబాద్లో ఇలా కలుసుకుని మాట్లాడుకోవడం ఆనందంగా ఉందని, అందరూ ఇక్కడ ఉన్నారని తెలిసి ఒక చోట కలిసి మాట్లాడుకుంటే బావుంటుందన్న ఉద్దేశ్యంతో జగదీశ్ రెడ్డి అనుములతో కలిసి ఈ డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. సంఘాలుగా విడిపోయినా, ఇతర విషయాల్లో మనమంతా ఒక్కటేనని ఎన్నారైల దృష్టంతా మాతృరాష్ట్ర ప్రగతికి ఏ విధంగా సహాయపడవచ్చనే దానిపైనే ఉంటుందని చెప్పారు.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ, ఆటా తరపున ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలను నిర్వహిస్తున్నామని ఈ సమయంలో తానా, టీటీఎ ఇతర నాయకులతో కలిసి మాట్లాడుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని అన్నారు. అందరం కలిసి పనిచేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు.
టిటిఎ అధ్యక్షుడు నవీన్ మలిపెద్ది మాట్లాడుతూ, టీటీఎ సేవాడేస్ కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టామని, తానా, ఆటా నాయకులతో కలిసి ఇతర విషయాలు పంచుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని చెప్పారు.
తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి సుబ్బారావు కూడా మాట్లాడుతూ, ఇలాంటి వేదికను ఏర్పాటు చేసి అందరినీ ఒకచోట కలిసేలా చేసిన రవి పొట్లూరి, జగదీశ్ రెడ్డి అనుములకు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలియజేశారు. హైదరాబాద్ మూడు పెద్ద సంఘాల నుంచి0 ఎన్నారైలు, నాయకులు ఒక విందు సమావేశానికి రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు.






