AP Assembly: కీలక సమస్యల నడుమ వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు.. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (Andhra Pradesh Assembly Sessions) ఈ నెల 16 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, అనూహ్యంగా అవి వాయిదా పడినట్లు అధికార వర్గాల సమాచారం వెల్లడైంది. ఇప్పటికే స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) డిసెంబర్ 16 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ, తాజాగా పరిస్థితులు మారడంతో సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఇప్పటికీ స్పష్టతకు రాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ వాయిదాకు గల కారణాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎదుర్కొంటున్న కొన్ని కీలక సమస్యలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఆయా అంశాలు చర్చకు రాకుండా తప్పించుకోవడం కష్టమే. ముఖ్యంగా రాజధాని అంశానికి (Capital Issue) సంబంధించిన చట్టబద్ధతపై బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అమరావతి (Amaravati)నే రాష్ట్ర రాజధానిగా ఖరారు చేయాలన్న నిర్ణయంపై స్పష్టమైన చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని సమాచారం.
ఇక రైతుల సమస్యలు (Farmers Issues) మరో పెద్ద తలనొప్పిగా మారాయి. మద్దతు ధరలు, ఎరువులు, పురుగుమందులు, నాణ్యమైన విత్తనాల సరఫరా వంటి అంశాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సమస్యేనని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) సంప్రదాయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించే విధానాలను అమలు చేస్తోంది. దీని ప్రభావంతో ఉత్పత్తి, దిగుమతులు తగ్గి రైతులకు అవసరమైన సరఫరా సక్రమంగా అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల పత్తి రైతులు (Cotton Farmers) ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ సమస్యను మరింత తీవ్రం చేశాయి. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినా సరైన స్పందన రాలేదని తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల వచ్చిన తుఫాను (Cyclone) కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందకపోవడం కూడా అసంతృప్తికి దారితీసింది. ఇవన్నీ అసెంబ్లీలో చర్చకు వస్తే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజధాని సరిహద్దుల విషయంలో కూడా ఇంకా స్పష్టత లేదు. గతంలో రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాలకు తోడు ప్రభుత్వ అధీనంలో ఉన్న 20 వేల ఎకరాలను కలిపి మొత్తం 53 వేల ఎకరాల్లో అమరావతిని అభివృద్ధి చేయాలన్న నిర్ణయం ఉంది. అయితే ఇప్పుడు మరో 46 వేల ఎకరాలు సేకరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ అంశాలన్నీ ఒక కొలిక్కి రాకముందే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉండటంతో, జనవరి రెండో వారం లో సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR) ప్రధాన ప్రతిపక్ష హోదా అంశం తేలితే తప్ప సమావేశాలకు హాజరు కాబోమని ఇప్పటికే అధినేత జగన్మోహన్ రెడ్డి (Y S Jagan Mohan Reddy) స్పష్టం చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సభలు వాయిదా పడడం ఒకరకంగా వైసిపి నేతలకి కలిసి వచ్చేలా ఉంది.






