TDP: తల్లికి వందనంపై టీడీపీ ప్రచారంలో సక్సెస్…?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చేసి ఏడాది దాటింది. పరిపాలన విషయంలో ముందు కాస్త ఇబ్బందులు పడిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత మాత్రం గాడిలో పడిందనే చెప్పాలి. సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముందు ఇబ్బంది పడిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వరుసగా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2024 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సర్కార్ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.
రాజకీయంగా కూడా సంక్షేమ కార్యక్రమాలపై వైసీపీ(YSRCP) విమర్శలు చేయడంతో కూటమి సర్కారు జాగ్రత్తలు తీసుకుంటూనే అమలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం తల్లికి వందనం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో అందిస్తున్న ఈ కార్యక్రమం పై ఇప్పుడు ప్రశంసల వ్యక్తం అవుతున్నాయి. ఇక దీనిని ప్రచారం చేసుకునే విషయంలో కూడా కూటమి నాయకులు విజయం సాధించారనే చెప్పాలి.
వైసీపీ చేస్తున్న విమర్శలకు అదే స్థాయిలో సమాధానం చెప్పడమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వాటిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు కూటమి నాయకులు. దాదాపుగా ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు, ఎంపీలు అందరూ వీటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దానితో పాటుగా ఏడాది నుంచి జరిగిన కార్యక్రమాలపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో కూటమి నాయకులు సక్సెస్ అవుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అలాగే వైసిపి చేసిన విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం వంటివి మెచ్చుకునే అంశాలు. వచ్చే నెలలో అమలు చేయబోయే అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ఇలాగే ప్రచారం చేయాలని మూడు పార్టీల కార్యకర్తలు కోరుతున్నారు.