Satish Kumar: సతీశ్ కుమార్ హత్య.. ఎవరి ప్రమేయం ఉండొచ్చు..!?
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణి (Parakamani) చోరీ కేసులో కీలక సాక్షిగా ఉన్న మాజీ అసిస్టెంట్ వెల్పేర్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (AVSO) సతీశ్ కుమార్ హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ కోసం సతీశ్ కుమార్ రైలులో బయలుదేరిన సమయంలో హత్యకు గురవడం పలు అనుమానాలకు తావిచ్చింది. సతీశ్ కుమార్ మృతిని తొలుత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగినా, పోలీసులు దీనిని హత్యగా నిర్ధారించి కేసు నమోదు చేశారు. సతీశ్ కుమార్ హత్య వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పరకామణి చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేస్తూ స్వయంగా సతీశ్ కుమార్ చేతిలో పట్టుబడ్డారు. సతీశ్ కుమార్ అప్పట్లో టీటీడీలో AVSOగా పనిచేస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినా, ఆ తర్వాత అనూహ్యంగా ఇదే సతీశ్ కుమార్ లోక్ అదాలత్ లో రవికుమార్‌తో కేసును రాజీ చేసుకున్నారు. దొంగతనం చేసిన వ్యక్తితో ఏకంగా టీటీడీ అధికారే రాజీ చేసుకోవడంపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ రాజీ వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని, కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగిందని విమర్శలు వచ్చాయి. ఈ రాజీపై ఓ వ్యక్తి హైకోర్టులో కేసు వేయడంతో, కోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత, హైకోర్టు లోక్ అదాలత్ రాజీని రద్దు చేసి, ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఐడీని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఈ విచారణకు సహకరించేందుకు సతీశ్ కుమార్ స్వయంగా ఈ నెల 6న విచారణకు హాజరయ్యారు. గతంలో టీటీడీలో ఏవీఎస్వోగా పనిచేసిన సతీశ్ కుమార్ ప్రమోషన్ పైన టీటీడీ నుంచి రైల్వే సీఐగా బదిలీ అయ్యారు. ఈ కేసులో మరోసారి విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన సమయంలోనే ఆయన హత్యకు గురయ్యారు. రైల్వే ట్రాక్ పక్కన శవం కనిపించడం, తల వెనుక భాగంలో బలమైన గాయం ఉండడంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం హత్య కేసు నమోదు చేశారు.
సతీశ్ కుమార్ హత్య వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. సతీశ్ కుమార్ నోరు విప్పితే బయటపడలేమని భావించిన కొందరు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చు. సతీశ్ కుమార్ సాక్షిగా ఉన్నందున, ఆయన వాంగ్మూలం ఈ కేసులో కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, సాక్షిని అడ్డు తొలగించుకుంటే కేసు బలహీనపడి, నిందితులు లబ్ది పొందుతారని భావించి ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుల్లో కూడా కీలక సాక్షులు హత్యకు గురైన ఉదంతాలను కొందరు గుర్తు చేస్తున్నారు. సతీశ్ కుమార్ హత్య కూడా అదే తరహాలో జరిగి ఉంటుందని కూటమి నేతలు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవికుమార్‌కు కూడా భద్రత కల్పించాలని టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఇప్పటికే కోరడం ఈ కేసులోని సున్నితత్వాన్ని తెలియజేస్తోంది.
సతీశ్ కుమార్ మృతిపై రాజకీయ నాయకుల ప్రకటనలు విమర్శలకు దారితీశాయి. వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, సాకె శైలజానాథ్ తదితరులు సీఐడీ వేధింపుల వల్లే సతీశ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు చేసి, హత్యో ఆత్మహత్యో నిర్ధారించక ముందే వైసీపీ నేతలు ఆత్మహత్య అని ఎలా చెప్పారని కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో వివేకా హత్యను కూడా గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సతీశ్ కుమార్ హత్య వల్ల లబ్ధి పొందేది ఎవరో అందరికీ తెలుసని, వారే ఈ పని చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.
కీలక సాక్షి హత్యతో పరకామణి కేసు మరింత జఠిలమైంది. హత్య వెనుక ఉన్న పెద్దలు ఎవరు, సాక్షిని అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో సీఐడీ దర్యాప్తు మరింత లోతుగా, సమగ్రంగా సాగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుపై దృష్టి సారించి, బాధ్యులను త్వరగా పట్టుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.






