1 Year Rule: చంద్రబాబు ఏడాది పాలన – సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12న అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. గత వైసీపీ (YCP) ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపిస్తూ, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ఏడాది కాలంలో కూటమి (NDA) ప్రభుత్వం సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లను ఓసారి బేరీజు వేద్దాం..
సానుకూల అంశాలు
1. అమరావతి పునరుద్ధరణ:
వైసీపీ హయాంలో రాజధాని అమరావతి (Amaravati) నిర్వీర్యమై, రైతుల త్యాగాలు వృథా అయ్యాయని విమర్శలు వచ్చాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని రాష్ట్ర రాజధానిగా పునరుద్ధరించే దిశగా చర్యలు చేపట్టారు. నిర్మాణ పనులు ప్రారంభించారు. రైతులకు భరోసా కల్పించారు. కేంద్రంతోపాటు ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థల నుంచి రుణ సాయం అందుతోంది. అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి.
2. పోలవరం ప్రాజెక్ట్‌కు ఊపనిచ్చి:
జాతీయ స్థాయి ప్రాజెక్ట్ అయిన పోలవరం (Polavaram) నిర్మాణం వైసీపీ హయాంలో ఆలస్యమైంది. కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో పనులను వేగవంతం చేసింది. కేంద్రంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. నిధుల కేటాయింపు, సాంకేతిక సహాయం సమర్థవంతంగా రాబట్టుకోగలుగుతున్నారు. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్తున్నారు.
3. సంక్షేమ పథకాల అమలు:
వైసీపీ అధినేత జగన్ సంక్షేమం తమ ట్రేడ్‌మార్క్ అని చెప్పుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ పథకాలతో దీటుగా స్పందిస్తోంది. పెన్షన్లు, ఆర్థిక సహాయం, రైతు సంక్షేమం కోసం డీబీటీ ద్వారా గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు ప్రజల ఖాతాల్లోకి జమ చేస్తోంది. దశలవారీగా హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసం సంపాదిస్తోంది.
4. పెట్టుబడుల ఆకర్షణ:
గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో పరిశ్రమలు రాష్ట్రానికి రావడం దాదాపు ఆగిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక వేత్తలకు భరోసా కల్పించి, పెట్టుబడులను ఆకర్షించేందుకు సరళీకృత విధానాలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇది శుభసూచకం. దాదాపు 14లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అందులో 9.5లక్షల కోట్లకు ఒప్పందాలు కూడా పూర్తయ్యాయని కూటమి ప్రభుత్వం చెప్తోంది.
5. రాజకీయ స్థిరత్వం:
మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో సమన్వయ సమస్యలు తలెత్తుతాయని చాలా మంది భావించారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వం చంద్రబాబుకు పూర్తి సహకారం అందిస్తున్నాయి. ఈ సమన్వయం వల్ల పాలన సాఫీగా సాగుతోంది. నిర్ణయాలు సత్వరం అమలవుతున్నాయి.
6. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ:
వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఈ అంశంపై విచారణలకు ఆదేశించింది. మద్యం కుంభకోణం, భూ కుంభకోణాలు లాంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. దోషులను శిక్షించే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఇక వ్యతిరేక అంశాలను ఓసారి పరిశీలిస్తే…
1. అమరావతిలో రెండో విడత భూసేకరణ:
అమరావతిని మరింత విస్తరించేందుకు కొత్తగా భూసేకరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే రైతులు త్యాగం చేసిన భూములను సద్వినియోగం చేయకుండా, కొత్త సేకరణ ప్రతిపాదనలు కాలయాపనగా మారుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
2. పోలవరం కంటే బనకచర్ల ప్రాజెక్ట్ పై దృష్టి:
పోలవరం ప్రాజెక్ట్ ను వేగవంతం చేస్తున్నప్పటికీ, బనకచర్ల ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకురావడం విమర్శలకు కారణమవుతోంది. పోలవరం పూర్తి కాకముందే కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం సరైనది కాదని విశ్లేషకులు సూచిస్తున్నారు.
3. అవినీతి ఆరోపణలు:
వైసీపీ హయాంలో అవినీతిని ప్రజలు తిరస్కరించారని చెప్పుకున్న కూటమి ప్రభుత్వంలోనూ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు అవినీతిలో మునిగిపోతున్నారని, పారదర్శక పాలన లోపిస్తోందని విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో వైసీపీకి ఏమాత్రం తగ్గట్లేదనే ఆరోపణలున్నాయి.
4. లాంగ్ టర్మ్ టార్గెట్స్ పై ఫోకస్:
ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఏం చేయాలి.. ఆ తర్వాత మళ్లీ అధికారంలోకి రావడానికి ఏం చేస్తే బాగుంటుంది అనే అంశాలపై ఆలోచిస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం అలాంటి వాటిని పట్టించుకోరు. తక్షణం పూర్తి కావాల్సిన వాటిని వదిలేసి.. క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్ లక్ష్యాలపై అధికంగా దృష్టి పెడుతుంటారు. క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వానికి మైనస్‌గా మారింది. స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి సన్నగిల్లిందని ఆరోపణలు ఉన్నాయి.
5. కమ్యూనికేషన్‌లో వైఫల్యం:
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి విఫలమవుతోంది. విపక్షాల ఆరోపణలపై వివరణ ఇవ్వడంలో ఫెయిలవుతోంది. అలాంటి మెకానిజం ఇటు పార్టీల్లో కానీ, అటు ప్రభుత్వంలో కానీ కనిపించట్లేదు. దీని వల్ల ప్రభుత్వం చేస్తున్న మంచి మూలన పడిపోయి చెడే ఎక్కువ ఫోకస్ అవుతోంది.
6. ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై విమర్శలు:
వైసీపీ హయాంలో అప్పులు పెరిగాయని విమర్శించిన చంద్రబాబు, తన పాలనలోనూ అప్పులపై ఆధారపడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమరావతి పునరుద్ధరణ, పోలవరం పనులు, సంక్షేమ పథకాలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. అయితే, అమరావతిలో భూసేకరణ వివాదం, అవినీతి ఆరోపణలు, ఆర్థిక నిర్వహణపై విమర్శలు, కమ్యూనికేషన్ లోపాలు ప్రభుత్వానికి సవాళ్లుగా నిలిచాయి. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటపడేసి, అభివృద్ధి పథంలో నడిపించేందుకు చంద్రబాబు అనుభవం, కూటమి సమన్వయం బలంగా ఉన్నప్పటికీ, విమర్శలను పరిష్కరించి, ప్రజల విశ్వాసాన్ని మరింతగా చూరగొనే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.