ఆన్లైన్ తో అవినీతికి అడ్డుకట్ట
ఆన్లైన్ నగదు బదిలీ విధానంతోనే అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దును తొలుత సీఎం చంద్రబాబే ప్రతిపాదించారనీ, దీన్ని ప్రధాని మోడీ సహా అందరూ సమర్థించారన్నారు. ఏపీ స్ఫూర్తితో ఈపీడీఎస్ దేశ వ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ ఎకౌంట్‌కు ఆధార్‌ను లింక్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కొత్త ప్రయత్నం ఇబ్బందికరంగా ఉండవచ్చునని, కానీ ఇలాంటి కష్టాల నుంచే అవకాశాలు వస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భీమ్ యాప్‌కు అంతా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా త్వరితగతిన ఆ సమస్య పరిష్కారమైందన్నారు.






