ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే గెలుపు
ముందస్తు ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో లోకేశ్ మాట్లాడారు. ఈ సమయంలో జమిలి ఎన్నికల ప్రస్తావ వచ్చింది. ముందస్తుకు సిద్ధమవుతున్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా, ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం నిర్ధారించలేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మాత్రమే చెప్పారు అని లోకేశ్ బదులిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేస్తున్న టీడీపీకాక ఇంకెవరు గెలుస్తారు? మూడేళ్లలో రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగింది. వచ్చే ఏడాదిలో మరింత చేసి చూపిస్తాం. గ్రామాల సమగ్రాభివృద్ధికోసం అవసరమైన ప్రణాళికలు అమలు చేస్తాం అని అన్నారు.













