Nara Lokesh: వైసీపీ ఆరోపణలపై నారా లోకేష్ సీరియస్… ఓపెన్ ఛాలెంజ్..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. తల్లికి వందనం (Thalliki Vandanam) పథకంపై వైసీపీ (YCP) చేస్తున్న నిరాధార ఆరోపణలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో స్పందించారు. వైసీపీ నేతలు తల్లికి వందనం పథకంలో రూ.15,000 హామీ ఇచ్చి, రూ.13,000 మాత్రమే ఇస్తూ మిగిలిన రూ.2,000 లోకేష్ జేబులోకి వెళ్లాయని ఆరోపించారు. ఈ ఆరోపణలను లోకేశ్ తీవ్రంగా ఖండించారు. వైసీపీకి 24 గంటల గడువు ఇచ్చి, ఆరోపణలు నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. నిరూపించలేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక సూపర్ సిక్స్ (Super Six) పథకం. గత వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద 42 లక్షల మందికి రూ.5,540 కోట్లు కేటాయిస్తే, కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రూ.8,745 కోట్లు అందిస్తోంది. ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లులతో పాటు ఇతర వర్గాలకు కూడా ప్రయోజనం కలుగుతోందని లోకేష్ స్పష్టం చేశారు. అయినప్పటికీ, వైసీపీ ఈ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ఆరోపణలు కొత్తేమీ కాదు. గతంలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును చంద్రబాబు నాయుడుపై నెట్టే ప్రయత్నం, పింక్ డైమండ్ చంద్రబాబు వద్ద ఉందని ఆరోపణలు, కోడికత్తి, గులకరాయి ఘటనలను టీడీపీకి అంటగట్టే కుట్రలు చేసిందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా తల్లికి వందనం పథకంపై నిరాధార ఆరోపణలతో వైసీపీ బరితెగించిందని, ఇది వారి రాజకీయ నీతి లేని వైఖరిని స్పష్టం చేస్తుందని లోకేష్ విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ప్రజాకర్షక నిర్ణయాలతో ముందుకు సాగుతున్న తరుణంలో వైసీపీ అసహనంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకటో తేదీనే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం, రేషన్ వాహనాల రద్దుతో ప్రజాధనాన్ని కాపాడడం, అమరావతి రాజధాని పునర్ నిర్మాణంలో కీలక చర్యలు తీసుకోవడం వంటి చర్యలు ప్రజల్లో సానుకూల స్పందన పొందుతున్నాయి. అయితే, వీటిని సహించలేని వైసీపీ, నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై దాడి చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.
లోకేష్ ఈ సందర్భంగా వైసీపీకి గట్టి హెచ్చరిక జారీ చేశారు. 24 గంటల్లో ఆరోపణలు నిరూపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ హెచ్చరికలతో వైసీపీ నేతల్లో గుండెల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. గతంలో లోకేష్ చేసిన సవాళ్లకు వైసీపీ సమాధానం చెప్పలేకపోయిన సందర్భాలను గుర్తు చేస్తూ, ఈసారి కూడా వారు నిరూపించలేరని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు.
వైసీపీ రాజకీయ కుటిలత్వం, కక్షపూరిత వైఖరి గతంలోనూ అనేక సందర్భాల్లో కనిపించింది. 2021లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుపై లోకేష్ తీవ్రంగా స్పందించి, జగన్ ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని ఎండగట్టారు. అదే విధంగా, అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో లోకేష్ ఇరుక్కున్నారని వైసీపీ చేసిన ఫేక్ ప్రచారాన్ని కూడా టీడీపీ తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో, తాజా ఆరోపణలు కూడా వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగమేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి సారిస్తుండగా, వైసీపీ మాత్రం నీచమైన ఆరోపణలతో ప్రభుత్వ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అమరావతి పునర్ నిర్మాణం, ఉచిత బస్సు పథకం, అన్నా క్యాంటీన్లు, ఉచిత ఇసుక వంటి చర్యలతో ప్రజల్లో నమ్మకం పెంచుతున్న కూటమి ప్రభుత్వం, వైసీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉందని లోకేష్ స్పష్టం చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.