Nara Lokesh: తల్లికి వందనం పథకం వివాదం పై ఘాటుగా స్పందించి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో “తల్లికి వందనం” (Thalliki Vandanam) పథకం పై తాజాగా మరొక కాంట్రవర్సీ వెలుగులోకి వచ్చింది. ఈ పథకంలో ప్రతి విద్యార్థికి ఇచ్చే రూ.15,000లో నుండి రూ.2,000 తగ్గించడం రాజకీయ వర్గాల్లో గందరగోళం రేపుతోంది. ప్రభుత్వం తగ్గించిన ఈ డబ్బు పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తామంటూ ప్రకటన చేసింది. అయితే, ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు దీనిపై తీవ్ర విమర్శలు చేస్తూ, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఖాతాలోకి ఆ డబ్బు వెళ్తోందని ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలపై మంత్రి లోకేశ్ మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులకు 24 గంటల గడువు ఇచ్చారు. వారు తగిన ఆధారాలు చూపించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. లోకేశ్ చేసిన సవాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో తెలియాల్సివుంది కానీ, ఇలాంటి బేస్ లేని విమర్శలు చేయడం దారుణమని విశ్లేషకులు అంటున్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చే మొత్తం నుంచి తగ్గించిన రూ.2,000 పాఠశాల నిధికి జమ చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, దానిని వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వాడుతున్నారన్న ఆరోపణలు ప్రజల్లో గందరగోళం రేపుతున్నాయి. లోకేశ్ (Lokesh) తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించకపోతే, వైసీపీ నేతలపై కోర్టులో కేసులు వేస్తానని సంకేతాలు ఇచ్చారు. ఇది మళ్లీ వైసీపీ నాయకులకు తలనొప్పిగా మారే అవకాశముంది.
ఇటీవల నారా లోకేశ్ తన పాలనలో రెడ్ బుక్ (Red Book) విధానాన్ని అమలు చేస్తున్నారని, తమ నాయకులను టార్గెట్ చేస్తూ అరెస్టులు చేయిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే మంత్రి లోకేశ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా బలమైన విధానాన్ని పాటిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన వ్యతిరేకులపై కోర్టుల్లో పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆయన మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వివాదంపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సివుంది. మంత్రి చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా? లేక మాటల తూటాలతోనే పరిమితమవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, ఆధారాలు లేని విమర్శలు రాజకీయంగా వ్యతిరేక ఫలితాలను తీసుకువచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. మరి ఈ విషయంలో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి..