ఇప్పుడు కాదు అమెరికా నుంచి వచ్చాక తేలుద్దాం!
నంద్యాల టిక్కెట్ వ్యవహారం కొలిక్కి రాలేదు. భూమా, శిల్పా వర్గీయులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. టిక్కెట్ విషయం మాత్రం తేల్చ లేదు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చాక నిర్ణయిస్తానని చంద్రబాబు చెప్పారు. ఆ విషయం పక్కన పెట్టి ఇరు వర్గాలు కలసి పనిచేయాలని సూచించారు. టిక్కెట్ ఎవరికి వచ్చినా, గెలుపు కోసం రెండు వర్గాలు సమిష్ఠిగా కృషి చేయాలని సృష్టం చేశారు. ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసంలో శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలతో మొదట విడివిడిగా మాట్లాడారు. అనంతరం భూమా వర్గానికి చెందిన మాజీ మంత్రి ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డిలతోనూ మాట్లాడారు. ఇరు వర్గాల నాయకులు ఎవరి వాదన వాళ్లు వినిపించారు. ముఖ్యమంత్రి మాత్రం టిక్కెట్ ఫలానా వారికి ఇస్తున్నామని చెప్పకుండా, ఎవరికిచ్చినా కలసి పనిచేయాలని సృష్టం చేశారు.













